Share News

BJP Telangana president Ranchand Rao: ఓట్ల కోసం దేశాన్నే అవమానిస్తారా?

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:55 AM

సీఎం రేవంత్‌రెడ్డి దేశాన్నే అవమానపరిచేలా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు...

BJP Telangana president Ranchand Rao: ఓట్ల కోసం దేశాన్నే అవమానిస్తారా?

  • సైనికుల వీరోచిత పోరాటాన్ని మరచిపోయారా?.. ప్రజలే అణుబాంబులుగా మారడం ఖాయం

  • రేవంత్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధ్వజం

  • కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్‌ విడుదల

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి దేశాన్నే అవమానపరిచేలా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని మరచిపోయారా? జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓట్ల కోసం దేశాన్నే అవమానిస్తారా? సైనికులను అవమానించడం ఎక్కడి సంస్కారం?’ అని నిలదీశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ డైరెక్షన్‌లో సీఎం రేవంత్‌, రేవంతుద్దీన్‌గా మారిపోయారని మండిపడ్డారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్‌ విడుదల చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. తాము ఇంటింటి ప్రచారం కోసం చేపట్టిన కార్పెట్‌ బాంబింగ్‌పై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు రాంచందర్‌రావు తెలిపారు. ప్రజల మద్దతుతో ఏ బాంబింగ్‌ అయినా చేస్తామని హెచ్చరించారు. ప్రజలే కాంగ్రెస్‌ పాలిట అణుబాంబులుగా మారడం ఖాయమన్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రె్‌సకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందబోవంటూ సీఎం రేవంత్‌, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి కారణంగా తమ ప్రాంతం మరో పాతబస్తీ అవుతుందేమోనని జూబ్లీహిల్స్‌ సెగ్మెంటులో స్థానికులు ఆందోళన చెందుతున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. 111 జీవోతో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన రేవంత్‌, ఇప్పుడు ఆ భూములను ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ఎంపీ రఘునందన్‌రావు నిలదీశారు. కాంగ్రె్‌సకు ఎంఐఎం తోకపార్టీ అని బీజేపీ శాసన సభాపక్ష ఉపనేత పాయల్‌ శంకర్‌ విమర్శించారు.


అభయ హస్తం కాదు... భస్మాసుర హస్తం

‘కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు, 13 ముఖ్య వాగ్దానాలు ప్రకటించింది. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది. కానీ దాదాపు 1000 రోజులు గడుస్తున్నా, ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. పేదలపై కాంగ్రెస్‌ పెట్టిన ఈ హస్తం అభయ హస్తం కాదు... భస్మాసుర హస్తం’ అని బీజేపీ తన చార్జిషీట్‌లో తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు అని ఆరోపించింది.

సీఎం రేవంత్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

సీఎం రేవంత్‌రెడ్డి సైనికుల పోరాటాన్ని అవమానపరిచారని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి బీజేపీఫిర్యాదు చేసింది. సీఎం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఆరోపించింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఉప నేత పాయల్‌ శంకర్‌తో పాటు పార్టీ నాయకుల బృందం శనివారం ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం అందజేసింది.

Updated Date - Nov 02 , 2025 | 04:55 AM