N Ramachandra Rao: కాంగ్రెస్ గుర్తుపై ఎంఐఎం అభ్యర్థి
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:47 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు....
420 కేసుల్లాగే అధికార పార్టీ హామీలు: రాంచందర్‌రావు
అధిష్ఠానం అన్నీ గమనిస్తోందని.. బీజేపీ శ్రేణులకు లేఖ!
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. తనకు కాంగ్రెస్ టిక్కెట్టు ఖరారు కాగానే సదరు అభ్యర్థి వెళ్లి మజ్లిస్ అధినేత ఒవైసీ ఆశీస్సులు తీసుకున్నారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య బంధం స్పష్టంగా కనపడుతోందని ఆరోపించారు. ‘ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేని నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్పష్టమైన ఉదాహరణ. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామని చెప్పి విషాద నగరంగా మార్చింది. కాంగ్రెస్ గెలిచాక వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని చెప్పింది. ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాలు చేశారు. కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేదంతా 420 కేసుల్లానే మిగిలింది’ అని మండిపడ్డారు. కాగా ఖమ్మం నుంచి డాక్టర్ కాసాని మారుతి గౌడ్, లండన్ నుంచి ఎన్నారై శశితో పాటు దేవరకొండ, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నుంచి పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. మరోవైపు గీత దాటొద్దు.. అధిష్ఠానం అన్నీ గమనిస్తోందని రాంచందర్‌రావు తమ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించాలి తప్ప బహిరంగ వేదికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ పదాధికారులు, పలువురు నేతలకు ఈమేరకు లేఖ రాసినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.
చిరంజీవితో ఆత్మీయ కలయిక
తన మనవరాలి కోరిక మేరకు తన కుటుంబసభ్యులతో చిరంజీవి, నయనతారను షూటింగ్ స్పాట్‌లో కలవడం పట్ల రాంచందర్‌రావు సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సినీ విశేషాలు, సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి అనేక ఆలోచనలు పంచుకున్నామని తెలిపారు.