Share News

BJP leaders protested in Hyderabad: రేవంత్‌ రెడ్డిది అహంకారం

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:37 AM

పెళ్లి చేసుకోని వారికి ఆంజనేయుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మందు తాగేవారికి మరో దేవుడు.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై......

BJP leaders protested in Hyderabad: రేవంత్‌ రెడ్డిది అహంకారం

  • హిందూ దేవుళ్ల అంశంలో సీఎం వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ

  • హైదరాబాద్‌లో నిరసనలు, సీఎం దిష్టిబొమ్మల దహనం

  • కాంగ్రెస్‌ నేతలకు ఇతర మతాల దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా ? : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకోని వారికి ఆంజనేయుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మందు తాగేవారికి మరో దేవుడు.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ హైదరాబాద్‌లో బుధవారం నిరసనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. హిందూ దేవుళ్లను అవమానించేలా సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ వ్యతిరేక వైఖరి తీసుకోవడం కాంగ్రె్‌సకు అలవాటేనని, కాంగ్రెస్‌ నేతలకు ఇతర మతాల దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. గతంలో హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌కు, బీఆర్‌ఎ్‌సకు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో ఆ విషయాన్ని సీఎం రేవంత్‌ గుర్తు చేసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఎన్నికల ముందు తానే గొప్ప హిందువునంటూ మాట్లాడిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే హిందువుల మనోభావాలను అవహేళన చేయడం సిగ్గు చేటు అని ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మాదిరిగానే రేవంత్‌ రెడ్డి కూడా ప్రచారం కోసం హిందూ దేవుళ్లపై నోరు పారేసుకోవడం శోచనీయమంటూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది కూడా తప్పుబట్టారు. మరోపక్క, సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం గాంధీభవన్‌ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


బీజేపీది దుష్ప్రచారం

  • సీఎం రేవంత్‌ రెడ్డి

హిందూ దేవుళ్లపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. జుబ్లిహిల్స్‌ ఉప ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయి నిరాశలో కూరుకుపోవడం వల్లే బీజేపీ ఇలా దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల వర్క్‌షా్‌పలో తాను అంతర్గతంగా మాట్లాడిన విషయాలను ముందు, వెనుక కట్‌ చేసి అసత్యప్రచారం చే స్తున్నారని సీఎం రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితేనేం, ఈ విధంగానైనా తనకు ఉత్తర భారతంలో జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. హిందూ దేవుళ్లు మూడు కోట్లమంది ఉన్నారని, ఈ దేవుళ్లలో ఒక్కొక్కరికీ ఒక్కో లక్షణం, ప్రత్యేకత ఉంటుందని అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా హిందూ సమాజం లాంటిదేనని, అందరూ ఒకేరకంగా ఉండరని తాను జిల్లా అఽధ్యక్షులకు చెప్పినట్లు రేవంత్‌ వివరించారు. పార్టీ నేతగా ఎలా పనిచేయాలన్న విషయాన్ని సరళంగా వివరించేందుకు అందరికీ తెలిసిన అంశాన్ని ఉదాహరణగా చెప్పానని అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యం కోల్పోతున్న బీజేపీ ఈ విషయాన్ని వక్రీకరించి, భూతద్దంలో పెట్టి చూపించి వివాదాస్పదం చేసిందని రేవంత్‌ రెడ్డి వివరించారు.

Updated Date - Dec 04 , 2025 | 04:37 AM