Ramchander Rao: కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలు
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:51 AM
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధం కావాలని బీజేపీ నిర్ణయించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మోసపూరితమని తేలిపోయిందని..
తెలంగాణలో హస్తం పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 100 శాతం బీజేపీదే విజయం
స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం: రాంచందర్‌రావు
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధం కావాలని బీజేపీ నిర్ణయించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మోసపూరితమని తేలిపోయిందని, ఏ ఒక్క డిక్లరేషన్ కూడా అమలు చేయలేదని ఆరోపించింది. మరోవైపు, ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం స్పష్టమవుతోందని పేర్కొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన బుధవారం, పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. కొత్త కమిటీ సభ్యులకు నియామక సర్టిఫికెట్లు అందజేశారు. ఈ తొలి సమావేశం సందర్భంగా రాంచందర్‌రావు, పదాధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోందని.. కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, దీన్ని ప్రజలకు గుర్తించారని, వారి విశ్వాసానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. బీజేపీలో ఒకరికి మరొకరు పోటీ కాదని.. ప్రత్యర్థులే పోటీ అనే విషయాన్ని గుర్తెరగాలని ఉద్బోధించారు. పార్టీలో ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడొద్దని.. అలా ఎవరైనా చేస్తే పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. పదాధికారులు గ్రామాలకు వెళ్లి పార్టీ బలోపేతం కోసం, ప్రజల సమస్యల కోసం పనిచేయాలని సూచించారు. బీసీలను మోసం చేసింది కాంగ్రెసేనని.. మోదీ సర్కారు బీసీలకు పెద్దపీట వేసిందని, కేంద్ర క్యాబినెట్‌లో 27మంది ఓబీసీలు ఉన్నారని చెప్పారు. జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం వందశాతం ఖాయమని రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తోందని పేర్కొంటూ, పోలింగ్ బూత్‌వారీగా కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.