CM Revanth Reddy Over Comments: సీఎం రేవంత్‌పై బీజేపీ పరువు నష్టం కేసు.. తీర్పుపై ఉత్కంఠ!
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:34 AM
సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో వేసిన పరువు నష్టం పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది...
నేడు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో వేసిన పరువు నష్టం పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-125 కింద కేసు కొనసాగుతుందని తెలిపింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పును బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ సోమవారం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది.