President N Ranchandrar Rao: ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం
ABN , Publish Date - Oct 02 , 2025 | 04:54 AM
ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు...
పార్టీ మారాలంటే పదవి వదులుకోవాల్సిందే.. స్థానిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక మొదలైంది
ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలని లేదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యలు
కరీంనగర్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. ఎవరైనా పార్టీ మారాల్సి వస్తే.. పదవికి రాజీనామా చేయాలన్నదే బీజేపీ అభిమతమన్నారు. బుధవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక మొదలైందని, వార్డు సభ్యుడు మొదలుకొని జడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. అత్యధిక స్థానాలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. స్థానిక సంస్థలను బీఆర్‌ఎస్ నిర్వీర్యం చేసిందని, కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా చేసిందని ఆరోపించారు. నాడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ దోపిడీ చేస్తే.. కాంగ్రెస్ మోసాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ మాత్రం అభివృద్ధిపైనే మాట్లాడుతోందని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి కాంగ్రె్‌సకు లేదని, హైకోర్టు ఆదేశించినందునే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని, ఎన్నికలు జరగాలన్నదే తమ అభిమతమని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల సవరణ అప్పుడే చేస్తే.. ఈ సమస్య వచ్చేది కాదన్నారు. కోర్టుకు కాంగ్రెస్ నేతలే వెళ్లి ఉంటారని రాంచందర్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ-ఈ క్యాటగిరీ ముస్లింలకు సంబంధించినదేనని, ఒకప్పుడు విద్య, ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేస్తే.. ఇప్పుడు రాజకీయాల్లోనూ వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్‌ఎస్ అవినీతి పాల్పడిందని, విచారణను మేడిగడ్డ, సుందిళ్లకే పరిమితం చేయకుండా ప్రాజెక్టుపై పూర్తిగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.