Share News

HCU land dispute: తప్పు చేసిందే బీఆర్‌ఎస్‌ నేతలు!

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:30 AM

హెచ్‌సీయూ భూముల విషయంలో తప్పు చేసింది బీఆర్‌ఎస్‌నేనని, వర్సిటీకి భూములు అప్పగించడంలో నిర్లక్ష్యం చూపినదీ వారు తానేనని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. 2185 ఎకరాల భూములపై ఇప్పటికీ చర్యలు చేపట్టలేదని విమర్శిస్తూ, ప్రహరీ నిర్మించి వర్సిటీకి అప్పగించాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేశారు.

HCU land dispute: తప్పు చేసిందే బీఆర్‌ఎస్‌ నేతలు!

విద్యార్థుల మీద ప్రేమ ఉంటే 2012లో కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను అమలు చేయలేదేం?: రఘునందన్‌రావు

హెచ్‌సీయూ భూములపై కొండా ఇంట్లో బీజేపీ ఎంపీల భేటీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): హెచ్‌సీయూ భూముల విషయంలో తప్పు చేసిందే బీఆర్‌ఎస్‌ వాళ్లని, ఇప్పుడు సుద్దపూసల్లా మాట్లాడుతున్నారని మెదక్‌ ఎంపీ రఘునందరావు ఆరోపించారు. వర్సిటీ భూముల వ్యవహారంపై బీజేపీ ఎంపీలు బుధవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంట్లో సమావేశమై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 1974లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం యూనివర్సిటీ అవసరాల కోసం 2324 ఎకరాల భూమిని కేటాయించిందని రఘునందన్‌రావు చెప్పారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు లీజుకిచ్చిన అనంతరం మిగిలిన 2185 ఎకరాలను యూనివర్సిటీకి బదలాయించ(అలినేషన్‌) లేదంటూ 2012లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ భూపరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు లేఖ రాశారన్నారు. అప్పుడే భూమిని వర్సిటీకి అలినేషన్‌ చేసి ఉంటే ప్రస్తుత వివాదమే ఉండేది కాదని చెప్పారు. ఈ భూముల నుంచే 400 ఎకరాలు ఐంఎంజీ సంస్థకు కేటాయించారని.. ఆ తర్వాత ఒప్పందం రద్దు చేయడంతో ఆ సంస్థ కోర్టుకు వెళ్లిందని గుర్తుచేశారు. ప్రస్తుత ఇందిరమ్మ పాలనలో మిగిలి ఉన్న భూములకు ప్రహరీ కట్టి, వర్సిటీకి అప్పగించాలని కాంగ్రెస్‌ నాయకులను డిమాండ్‌ చేశారు. 2012లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక సీసీఎల్‌ఏలో పెండింగ్‌లో ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక అప్పటి బీఆర్‌ఎస్‌ పాలకులు ఆ నివేదిక ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు.


నాటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా 2185 ఎకరాలను హెచ్‌సీయూకు అలినేషన్‌ చేయాలని లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. ఐఎంజీ భూములు 400 ఎకరాలు మినహాయించి, మిగిలిన 1785 ఎకరాలకైనా ఎందుకు ప్రహరీ నిర్మించలేదని, కేటీఆర్‌ ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. వర్సిటీ భూములను టీఎన్‌జీవోలకు ఇచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసం వర్సిటీలో రోడ్డు వేసింది ఎవరని నిలదీశారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మిగిలి ఉన్న భూములకైనా ప్రహరీ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 16 వరకు సుప్రీం కోర్టు స్టేట్‌సకో ఇస్తే.. ఇంతలోనే ఆ భూములు తమవేనంటూ టీజీఐఐసీ బోర్డు పెట్టడం కోర్టు ధిక్కరణ కాదా? అన్నారు. అందరి చరిత్ర తీసుకుని గన్‌పార్క్‌కు వస్తే చర్చించేందుకు బీజేపీ సిద్ధమేనని రఘునందన్‌రావు చెప్పారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. భూముల విషయంలో చట్ట ప్రకారం ఏం చేయాలనే అంశంపై చర్చించామన్నారు. బీఆర్‌ఎస్‌ వాళ్ల బాధంతా ఆ భూములను తాము అమ్ముకోలేకపోయామనే తప్ప, వేరే ఏమీ లేదని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Updated Date - Apr 10 , 2025 | 05:31 AM