BJP MP Laxman: హెచ్‌ఐఎల్‌టీపీని వెనక్కి తీసుకోవాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:59 AM
తెలంగాణ సంపదను అప్పనంగా బడా బాబులకు కట్టబెట్టే కుట్రలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
పారిశ్రామిక వాడల్లోని భూములను అమ్మి రూ.వేల కోట్ల దోపిడీకి తెలంగాణ సర్కారు కుట్ర: లక్ష్మణ్
న్యూఢిల్లీ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంపదను అప్పనంగా బడా బాబులకు కట్టబెట్టే కుట్రలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ(హెచ్‌ఐఎల్‌టీపీ)కి ఆమోదం తెలపడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న పారిశ్రామిక వాడల్లోని భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన హెచ్‌ఐఎల్‌టీపీ వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. మంత్రివర్గం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓఆర్‌ఆర్ లోపల దశాబ్దాల కిందట అప్పటి ప్రభుత్వాలు పారిశ్రామిక వాడలకు భూములు కేటాయించాయని అన్నారు. నాచారం, బాలానగర్, సనత్‌నగర్, జీడీమెట్ల, పటాన్‌చెరు, కాటేదాన్, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కుషాయిగూడ తదితర పారిశ్రామిక వాడల్లో ఉన్న దాదాపు 10 వేల ఎకరాలను ఏకపక్షంగా మల్టిపుల్ జోన్లుగా మార్చి.. రూ.వేల కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆయన ఆరోపించారు.