BJP: జంబో జాబితాకు నో!
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:41 AM
రాష్ట్రంలో పార్టీ పదవుల కోసం బీజేపీ నేతలు పెట్టుకున్న ఆశలపై జాతీయ నాయకత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర కమిటీలో మరికొందరు సీనియర్లకు చోటు కల్పించడంతోపాటు...
బీజేపీ రాష్ట్ర కమిటీలో పరిమిత సంఖ్యలోనే పదవులు
ఎక్కువ మందికి చోటు కల్పించే ప్రతిపాదన పక్కకే..
భారీ జాబితాకు కోతపెట్టిన జాతీయ నాయకత్వం
ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు భేటీ
జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నద్ధతపై నివేదిక
నేడు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం
హైదరాబాద్/ న్యూఢిల్లీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పార్టీ పదవుల కోసం బీజేపీ నేతలు పెట్టుకున్న ఆశలపై జాతీయ నాయకత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర కమిటీలో మరికొందరు సీనియర్లకు చోటు కల్పించడంతోపాటు అనుబంధ విభాగాల్లో ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు రూపొందించిన భారీ జాబితాకు కోతపెట్టింది. కమిటీలు, అనుబంధ విభాగాల్లో ఇంతకుముందు తరహాలోనే పరిమిత సంఖ్యలోనే పదవులు ఉంటాయని జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రాంచందర్‌రావు శనివారం ఢిల్లీలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ తదితరులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాన్ని వారికి వివరించారు.
భారీ జాబితాతో వెళ్లినా..
రాంచందర్‌రావు గత నెల మొదటివారంలో 22 మంది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, జాయింట్ కోశాధికారి, ముఖ్య అధికార ప్రతినిధి ఉన్నారు. అయితే పదవులు ఆశించిన కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. రాంచందర్‌రావు రాష్ట్ర కమిటీలో, వివిధ విభాగాల్లో మరికొందరికి అవకాశం కల్పించేలా భారీ జాబితా సిద్ధం చేసుకుని ఢిల్లీ వెళ్లారు. ఆ నియామకాలకు జాతీయ నాయకత్వం అనుమతి కోరారు. మరో ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు కార్యదర్శులు, 20 మందికిపైగా అధికార ప్రతినిధులను నియమిస్తామని వివరించారు. కానీ, గతంలో ఉన్న పదవులకు మించివద్దని, జాబితాను కుదించాలని జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో 10-12 మందికి మాత్రమే అధికార ప్రతినిధులుగా అవకాశం రావొచ్చని సమాచారం. కాగా, ఢిల్లీ పర్యటన సందర్భంగా త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డితో రాంచందర్‌రావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఎన్.గౌతంరావు బాధ్యతల స్వీకరణ
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ నాయకులు ఎన్.గౌతంరావు, శనివారం బాధ్యతలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.
నేడు జూబ్లీహిల్స్‌బీజేపీ అభ్యర్థి ఖరారు
రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని పార్టీ జాతీయ నాయకత్వం ఆదివారం ఖరారు చేయనుంది. సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులతోపాటు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగనున్న 8 స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రేసులో ఉన్న ముగ్గురి నుంచి ఒకరిని ఎంపిక చేసి ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రేసులో లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్టు తెలిసింది.