Share News

BJP Leaders Stress Unity: ఐక్యంగా పనిచేస్తే.. అధికారం మనదే

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:32 AM

తెలంగాణలో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ పిలుపునిచ్చారు....

BJP Leaders Stress Unity: ఐక్యంగా పనిచేస్తే.. అధికారం మనదే

  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రె్‌సను ఓడించడం కష్టమేం కాదు

  • ఒక్కసారి పార్టీ కండువా వేసుకుంటే బీజేపీ కుటుంబమే..

  • రాంచందర్‌కు నాలాంటి లక్ష మంది మద్దతు: బీఎల్‌ సంతోష్‌

  • పార్టీకి కార్యకర్తలే సుప్రీం: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీలో పలువురు సీనియర్‌ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పతాకస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆయన తనదైన శైలిలో స్పందించారు. ‘మీరంతా ఐక్యంగా పనిచేయండి.. కలిసి పనిచేస్తే కాంగ్రె్‌సను ఓడించడం కష్టమేం కాదు’ అని వ్యాఖ్యానించారు. కొత్త, పాత అన్న వాదనకు తావులేదని, ఒకసారి పార్టీ కండువా వేసుకుంటే అంతా బీజేపీ కుటుంబ సభ్యులే అని చెప్పారు. ఎంత క్రియాశీలకంగా పనిచేస్తే పార్టీ నాయకత్వం కూడా అంతే స్థాయిలో స్పందిస్తుందని పార్టీ శ్రేణులనుద్దేశించి అన్నారు. ఆదివారం తుక్కుగూడలోని ఓ ఫంక్షన్‌ హాలులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అధ్యక్షతన సంస్థాగత వర్క్‌షాప్‌ నిర్వహించారు. దీనికి బీఎల్‌ సంతోష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ అభయ్‌ పాటిల్‌, కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ అధికార ప్రతినిధి సందీప్‌ పాత్రాతో పాటు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు ఈ వర్క్‌షా్‌పలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత బలోపేతం, పోలింగ్‌ బూత్‌స్థాయి కార్యక్రమాల నిర్వహణపై ప్రధానంగా చర్చించారు. బీఎల్‌ సంతోష్‌ మాట్లాడుతూ.. అన్నీ పరిశీలించిన తర్వాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావును నియమించినట్లు స్పష్టం చేశారు. ‘రాంచందర్‌రావును అధ్యక్షుడిగా నియమించినప్పుడు కొంతమంది అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఆయన శక్తిసామర్థ్యాలు అన్నీ పరిశీలించాకే ఆయన్ను నియమించాం. ఎవరిని యుద్ధ సమయంలో వాడుకోవాలో, ఎవరిని శాంతి సమయంలో వాడుకోవాలో పార్టీకి తెలుసు.. రాంచందర్‌రావుకు నాలాంటి వాళ్లు లక్ష మంది మద్దతు ఉంది. ఆయనపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా ఏమీ కాదు. కేంద్ర పార్టీ మొత్తం ఆయనకు అండగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆయన రాంచందర్‌రావుకు సూచించినట్లు సమాచారం. ‘పార్టీలో నాయకుల అనుచరులుగా కాకుండా కార్యకర్తలుగా ఎదగండి. రాంచందర్‌రావుకు మద్దతుగా నిలవండి’ అని బీఎల్‌ సంతోష్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలను ఒక అవకాశంగా మలుచుకుని స్థానికంగా ఎదగాలని సూచించారు. ఒక్కో నాయకుడు ఐదారు పంచాయతీల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని ఆదేశించారు. బీజేపీకి కార్యకర్తలే సుప్రీం అని రాంచందర్‌రావు అన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా ఈ వర్క్‌షాప్‌ కీలక అడుగు కాబోతోందని చెప్పారు. ‘వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే మన లక్ష్యం. కలిసికట్టుగా పనిచేద్దాం’ అని పిలుపునిచ్చారు. వర్క్‌షాప్‌ అనంతరం.. సంతోష్‌, రాంచందర్‌రావు, అభయ్‌ పాటిల్‌తో కలిసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Updated Date - Dec 01 , 2025 | 05:32 AM