Share News

Jajula Srinivas Goud: బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికల డిమాండ్‌ విడ్డూరం

ABN , Publish Date - Jun 25 , 2025 | 07:15 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా.. తెలంగాణలో తక్షణమే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు.

 Jajula Srinivas Goud: బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికల డిమాండ్‌ విడ్డూరం

బీసీలకు అన్యాయం చేసేందుకే బీజేపీ నేతల యత్నం: జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా.. తెలంగాణలో తక్షణమే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. ఇటీవల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్‌రెడ్డి, బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ ఎ. మహేశ్వర్‌ రెడ్డి తక్షణం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచేందుకు కేంద్రం నుంచి అనుమతి కోసం రాష్ట్రప్రభుత్వం నిరీక్షిస్తోందని ఈ విషయంలో తెలంగాణలోని బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి పెంచకుండా స్థానిక ఎన్నికలకు డిమాండ్‌ చేయడం అంటే బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నంగానే భావించాల్సి వస్తుందని శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి జూలై మొదటి వారంలో జాతీయ రహదారులను దిగ్బంధించనున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 25 , 2025 | 07:17 AM