BJP Leaders Clash: నల్లగొండలో కమలనాథుల డిష్యుం..డిష్యుం
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:28 AM
నల్లగొండ జిల్లా బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. గురువారం నల్లగొండలో నిర్వహించిన మాజీ ప్రధాని వాజపేయి జయంతి కార్యక్రమంలో బీజేపీ నాయకులు...
పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల ఘర్షణ.. చొక్కాలు పట్టుకొని పిడిగుద్దులు
ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకున్న వైనం
నల్లగొండ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. గురువారం నల్లగొండలో నిర్వహించిన మాజీ ప్రధాని వాజపేయి జయంతి కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణ పడ్డారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించాలని పార్టీ జిల్లా నాయకత్వం ఇటీవల నిర్ణయించింది. వాజపేయి జయంతి కార్యక్రమంలో వారిని సన్మానించేందుకు పార్టీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ తన అనుచరులతో కలిసి శాలువాలు, పుష్పగుచ్ఛాలతో పార్టీ కార్యాలయానికి వచ్చారు. సన్మాన కార్యక్రమం వాయిదా పడిందని, కాబట్టి సన్మానం నిర్వహించవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, ముఖ్య నాయకులు రామరాజుకు చెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన రామరాజు ‘సన్మానం చేయవద్దనడానికి నీవు ఎవర’ంటూ వర్షిత్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. వర్షిత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందిస్తూ ‘సన్మానం చేయడానికి నీవెవరు’ అంటూ ప్రశ్నించారు. మాటామాటా పెరిగి ఇద్దరు నాయకుల అనుచరులు ఆగ్రహంతో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. చొక్కాలు పట్టుకొన్నారు. ఒక దశలో పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి ఘర్షణ తీవ్రం కాకుండా చూశారు. ఈ ఘర్షణను అక్కడే ఉన్న ఫొటో, వీడియో జర్నలిస్టులు ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో వర్షిత్ రెడ్డి ఫొటో జర్నలిస్టు ఒకరి నుంచి కెమెరా లాక్కుని ఫొటోలు, డేటాను తొలగించారు. ఫొటో, వీడియో జర్నలిస్టులు ధర్నాకు దిగటంతో వర్షిత్ రెడ్డి క్షమాపణ చెప్పారు.