BJP Leader Lakshman: మీ జనాభా ఎంత?
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:13 AM
జిత్ నా ఆబాదీ.. ఉత్ నా హిస్సా. ఎంత జనాభాకు అంత వాటా ఇవ్వాలంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముందు తన సామాజికవర్గ జనాభా ఎంతో స్పష్టం చేయాల...
మీ కుటుంబానికి మూడు ఎంపీ పదవులెందుకు?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు బీజేపీ నేత లక్ష్మణ్ సూటిప్రశ్న
బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు అని ధ్వజం
కులగణనపై రాష్ట్ర ప్రభుత్వానివి కాకి లెక్కలని విమర్శ
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిత్ నా ఆబాదీ.. ఉత్ నా హిస్సా.. (ఎంత జనాభాకు అంత వాటా) ఇవ్వాలంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముందు తన సామాజికవర్గ జనాభా ఎంతో స్పష్టం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ‘మీ కుటుంబ సభ్యులు ఎంతమంది? మీకు మూడు ఎంపీ పదవులు ఎందుకు?’ అని నిలదీశారు. రూ. 200 కోట్లు ఖర్చుచేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారిందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ బిల్లులు, ఆర్డినెన్సులు.. జీవోల పేరుతో బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి వారిని వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కాకా కలేల్కర్ కమిషన్ నివేదికను నెహ్రూ వ్యతిరేకించిన మాట వాస్తవం కాదా? అని సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించారు. మోసానికి ప్రతిరూపం కాంగ్రెస్ పార్టీ అని, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను బురిడీ కొట్టించిందని ఆరోపించారు. అడుగడుగునా బీసీలను దగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని లక్ష్మణ్ దుయ్యబట్టారు. 1988లో ఎన్టీఆర్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, కాంగ్రెస్ పార్టీ దానిని 17 శాతానికి పరిమితం చేసిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ కూడా బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. పార్టీ గుర్తులేకుండా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు పార్టీపరంగా 42 శాతం సీట్లు ఇస్తామని ఎవరిని మభ్యపెడుతున్నారని, డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. 2026లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగే కులగణన ద్వారా మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కులగణన చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ అధికారం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకి లెక్కలేనని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చడం శాశ్వత పరిష్కారం కాదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం తెలిసి కూడా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ఆత్మవంచన చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.