ELT Maheshwar Reddy: హెచ్‌ఐఎల్‌టీ విధానంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:35 AM
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ హెచ్‌ఐఎల్‌టీ విధానం దేశంలోనే భారీ కుంభకోణమని, ఈ ప్రక్రియలో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు....
దేశంలోనే భారీ కుంభకోణమిది: బీజేఎల్పీ నేత ఏలేటి
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హెచ్‌ఐఎల్‌టీ)’ విధానం దేశంలోనే భారీ కుంభకోణమని, ఈ ప్రక్రియలో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆరునెలల ముందే పలువురు పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకున్నారని, వారి పరిశ్రమల్లో వాటాదారులుగా చేరారని పేర్కొన్నారు. పారిశ్రామిక భూముల మార్పిడి కోసం టీజీఐఐసీ ధరలను కాదని.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ధరలను పరిగణనలోకి తీసుకోవడంలోనే మతలబు ఉందని చెప్పారు. రూ.6 లక్షల కోట్లకుపైగా విలువజేసే పారిశ్రామిక భూములను కేవలం రూ.5 వేల కోట్లకే ధారాదత్తం చేయడమంటే ఖజానాను కొల్లగొట్టడమేనని మండిపడ్డారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వాటాలు పంచుకోవడంతోపాటు పార్టీ జాతీయ నాయకత్వానికి భారీ మొత్తం పంపేందుకే ఈ భూదందాకు తెరతీశారని ఆరోపించారు. మరో మూడేళ్లు సీఎంగా కొనసాగడంతోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పెత్తనం చెలాయించాలన్నది రేవంత్ ఆలోచన అని విమర్శించారు. ఈ పాలసీపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఐఎల్‌టీ పాలసీపై క్యాబినెట్ భేటీలో ఏ మంత్రి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని, వారికి కూడా ఈ భూదందాలో పాత్ర ఉన్నట్లుగానే భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.