BJP president Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రాముడికి వ్యతిరేకం
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:32 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రాముడికి వ్యతిరేకమని, అందుకే జీ రామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు...
అందుకే జీ రామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.. 1000కి పైగా సర్పంచ్‌ల గెలుపు- బీజేపీకి శుభసూచకం
నిర్మల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
నిర్మల్ రూరల్/హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రాముడికి వ్యతిరేకమని, అందుకే జీ రామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులతో శుక్రవారం నిర్మల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే వంద రోజుల పని దినాలను ‘జీ రామ్ జీ’ ద్వారా 125 రోజులకు పెంచామన్నారు. రాష్ట్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో బీజేపీ 1000 మందికి పైగా సర్పంచ్‌లను, 1200లకు పైగా ఉప సర్పంచ్‌లను, 10వేలకు పైగా వార్డులను గెలుచుకోవడం శుభసూచకమని తెలిపారు. పల్లె జనం కూడా బీజేపీ వైపు చూస్తున్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉపనేత శంకర్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరయ్యారు.
నితిన్ నబిన్‌కు బండి సంజయ్ శుభాకాంక్షలు
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం, పార్టీ కేంద్ర కార్యాలయంలో నితిన్ నబిన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శనివారం విశాఖపట్నంలో జరగనున్న వాజ్‌పాయ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గ్రామ స్వరాజ్యానికి నవశకం.. జీ రాం జీ బిల్లు: అరుణ
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘జీ రాం జీ’ బిల్లు గ్రామ స్వరాజ్యానికి నవశకం అని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్‌లో కూలీలు తీరిక లేకుండా ఉంటారని, ఆ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ బిల్లులో 60 రోజుల విరామ సమయం కల్పించామని ఆమె తెలిపారు. కూలీలకు వారానికి లేదా 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లిస్తారని, హాజరు కోసం బయోమెట్రిక్ విధానం అమలు చేస్తారని వివరించారు. అంతకుముందు ఉపాధి హామీ పథకంలో కూలీలకు విరామ సమయం ఉండేది కాదని, ప్రాజెక్టు పనులు పూర్తయ్యాకే వేతనం చెల్లించేవారని అరుణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతరెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద పరిశ్రమ కూడా రాష్ట్రంలో ఏర్పాటు కాలేదని ఆరోపించారు.