BJP state president N. Ramchander Reddy: నగరాల్లోనే కాదు.. పల్లెల్లోనూ గెలిచాం
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:06 AM
నగరాలకే పరిమితమైన పార్టీ అని తమను విమర్శించిన వారికి, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి వస్తున్న విజయాలే గట్టి సమాధానమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు...
అధికారమే లక్ష్యంగా బీజేపీ బలపడుతోంది
బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోతోంది: రాంచందర్‌రావు
హైదరాబాద్/యాదాద్రి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నగరాలకే పరిమితమైన పార్టీ అని తమను విమర్శించిన వారికి, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి వస్తున్న విజయాలే గట్టి సమాధానమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గ్రామాల్లో తమ పార్టీ బలపడుతోందని, 2028లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న పూర్తి విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను గురువారం భువనగిరిలో ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోతోందని, సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు అధిక సంఖ్యలో ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతల బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనా, ప్రజలు ధైర్యంగా బీజేపీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని, రానున్న కాలంలో ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటి కాకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి సమర్థించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేశాయని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కార్యకర్తల కష్టం, ప్రజల అండతో కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను బీజేపీ గెలుచుకుంది.’’ అని రాంచందర్‌రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
స్థానిక, మునిసిపల్ ఎన్నికలు పెట్టాలి: ఏలేటి
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సర్కారుకు ధైర్యముంటే తక్షణమే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికలను నిర్వహించాలని సవాల్ చేశారు.