BJP Telangana president Ramchander Rao: 20శాతం ముస్లింల కోసం హిందువులను నిర్లక్ష్యం చేస్తారా?
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:15 AM
ముస్లింలు ఉన్నారంటే అది కాంగ్రెస్ వల్లే అంటూ.. ముస్లింలకు గౌరవం ఉందంటే అదీ కాంగ్రెస్ వల్లే అంటూ.. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు దిక్కులేదు..
ముస్లిం ఓట్లే కావాలనుకుంటే హిందువుల ఓట్లు అవసరం లేదని రేవంత్ రెడ్డి చెప్పాలి
సమాజాన్ని మతం పేరుతో విభజించి లబ్ధి పొందాలనే కుట్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ముస్లింలు ఉన్నారంటే అది కాంగ్రెస్ వల్లే అంటూ.. ముస్లింలకు గౌరవం ఉందంటే అదీ కాంగ్రెస్ వల్లే అంటూ.. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు దిక్కులేదు అంటూ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మత ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలను మాత్రమే నమ్ముతోందనే విషయం మరోసారి స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. పాలన, అభివృద్ధి, ప్రజాసేవపై చర్చించడానికి బదులుగా సమాజాన్ని మతం పేరుతో విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు, అధికారాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 20శాతం ముస్లిం ఓట్ల కోసం 80శాతం హిందువుల మనోభావాలను నిర్లక్ష్యం చేస్తున్నారని.. దీనికి లౌకికవాద ముసుగు తొడగడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉప ఎన్నికలలో లబ్ధి పొందేందుకు మంత్రి పదవిని కూడా మత ప్రాతిపదికన కేటాయించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ముస్లిం సమాజానికి నిజమైన న్యాయం చేయాలంటే విద్య, ఉపాధి, మెరుగైన ఆర్థిక అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని.. కానీ కాంగ్రెస్ మాత్రం వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని ఆరోపించారు. ‘‘మీకు, మీ పార్టీకి ముస్లింల ఓట్లు మాత్రమే కావాలనుకుంటే, హిందువుల ఓట్లు అవసరం లేదని బహిరంగంగా చెప్పే ధైర్యం చూపాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30వేల చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖను విడుదల చేశారు. బీజేపీ ఎప్పుడూ వ్యవస్థలను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకోలేదని.. ఇక ముందు వాడుకోదని ఆ పార్టీ నేత, ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని తన కక్షపూరిత రాజకీయాల కోసం వాడుకున్న సంగతి దేశానికి తెలుసునన్నారు. గతంలో సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అంటూ నిర్వచించేవారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 20నెలల పాలనలో బీఆర్‌ఎస్ నేతలకు, రాహుల్‌గాంధీకి, ఏఐసీసీ నాయకత్వం మధ్య ఏదో ఒప్పందం కుదరి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులను అరెస్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ బద్నాం అవుతుందని భావించే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్మానం చేసినట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.