TPCC chief Mahesh Kumar Goud: ఆపరేషన్ పోలో చరిత్రను వక్రీకరిస్తూ.. పటేల్‌ను అవమానిస్తున్న బీజేపీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:07 AM
భారత స్వాతంత్య్ర పోరాటంలో కానీ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోగానీ పాత్రే లేని బీజేపీ.. తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ విలీన దినోత్సవాన్ని వాడుకుంటోందని...
పహల్గాం ఘటన తర్వాతా పాక్‌తో క్రికెట్ మ్యాచా?: మహే్‌షగౌడ్
హైదరాబాద్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): భారత స్వాతంత్య్ర పోరాటంలో కానీ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోగానీ పాత్రే లేని బీజేపీ.. తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ విలీన దినోత్సవాన్ని వాడుకుంటోందని టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ అన్నారు. ఆపరేషన్ పోలో చరిత్రను వక్రీకరిస్తూ విమోచన పేరుతో డ్రామా ఆడుతున్న బీజేపీ.. తద్వారా హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన సమయంలో ఆ పార్టీ ఉనికి ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ తీరుతో పటేల్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన విలీన వేడుల్లోనూ పాల్గొన్న ఆయన మాట్లాడారు. బీజేపీకి చరిత్ర తెలియదని, చరిత్రను వక్రీకరించడం.. తిరగరాయడమే తెలుసునని విమర్శించారు. నెహ్రూ ఆదేశాలతో పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేశారన్నారు. విలీనం కోసం అహర్నిశలు కృషి చేసిన రామానంద తీర్థ, జమాలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహరావు వంటి మహనీయులను, నిజాం వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, కమ్యూనిస్టు యోధులను స్మరించడం ప్రతి తెలంగాణ వాసి బాధ్యత అన్నారు. పహల్గాం ఘటన జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించారని నిలదీశారు. అమిత్‌షా కుమారుడు, బీసీసీఐ అధ్యక్షుడు జైషా ఆధ్వర్యంలోనే ఈ క్రికెట్ మ్యాచ్ జరిగిందన్నారు. విలీన దినోత్సవానికి, కవితకు ఏంటి సంబంధమని, ఆమె చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ నడిపిస్తున్న ‘ఓటు చోరీ ఉద్యమం’ బీజేపీ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నదన్నారు. కాగా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోగాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో జరిగిన కార్యక్రమంలోనూ మహే్‌షకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నసంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
కాంగ్రె్‌సలో ఒక స్థాయి వరకే స్వేచ్ఛ
కోమటిరెడ్డి సోదరులు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని మహే్‌షగౌడ్ అన్నారు. అయితే కాంగ్రె్‌సలో ఒక స్థాయి వరకే స్వేచ్ఛ ఉంటుందని, రెడ్‌లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీల కోసం పోరాడే నేతగా తీన్మార్ మల్లన్నను గౌరవిస్తానని, అయితే ఆయన కాంగ్రెస్ నిర్ణయాలను వ్యతిరేకించినందునే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పార్టీలు ఎవరు పెట్టినా స్వాగతిస్తామని ఆయన చెప్పారు.