IT Minister Duddilla Sridhar Babu: ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్..
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:01 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజారిటీని పెంచుకునేందుకు కాంగ్రెస్ పనిచేస్తుంటే.. బీజేపీ, బీఆర్‌ఎస్ మాత్రం తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు...
గందరగోళం సృష్టించేందుకే సీఎం వ్యాఖ్యల వక్రీకరణ: దుద్దిళ్ల
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజారిటీని పెంచుకునేందుకు కాంగ్రెస్ పనిచేస్తుంటే.. బీజేపీ, బీఆర్‌ఎస్ మాత్రం తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోటీ పడుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసం బీఆర్‌ఎస్, బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రె్‌సపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలోని శాలివాహననగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మీడియాతో ఆయన మాట్లాడారు.. ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క ప్రధాన సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ఆపబోదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని కేటీఆర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘నేను రాజు కాదు అని ప్రజల సొమ్ముకు ధర్మకర్తను మాత్రమే’ అని ఎన్నోసార్లు రేవంత్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. ప్రతిపక్షాల జూటా మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా ముందుకెళ్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రె్‌సకు మద్దతు తెలిపిన మాదిగ దండోరా, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, టీఎమార్పీఎస్, ఓయూ టీజీఆర్‌ఎ్‌సఏ తదితర దళిత సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.