Union Minister Bandi Sanjay Kumar: స్థానిక సమరంలో కొత్త చరిత్ర సృష్టిస్తాం
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:41 AM
స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్థంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించడం కోసం...
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా
కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలను గెలుచుకుంటాం
హైదరాబాద్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్థంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు, గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు సిద్థమని ప్రకటించారు. స్థానిక సమరంలో ఈసారి బీజేపీ కొత్త చరిత్రను లిఖించబోతోందని, కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తామన్నారు. ఆసియా కప్‌లో ఇండియా ఘన విజయం సాధించినట్లుగానే కరీంనగర్ పల్లె లీగ్(కేపీఎల్ లీగ్), సిరిసిల్ల పల్లె లీగ్(ఎస్పీఎల్) స్థానిక పోటీల్లోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమని చెప్పారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నిఖార్సైన బీజేపీ కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని బండి సంజయ్ ప్రకటించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలవల్ల స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. స్థానిక సంస్థల పాలక మండళ్ల గడువు ముగిసి రెండేళ్లు కావొస్తున్నా ఎన్నికలను నిర్వహించకపోవడంవల్ల రాజ్యాంగం ప్రకారం కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయాయని చెప్పారు. దీనికి ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే కారణమన్నారు.