Biting Cold in Telangana: వణికిస్తున్న చలి.. గిన్నెధరిలో 6.1 డిగ్రీలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:20 AM
రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో మంగళవారం అత్యల్పంగా....
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్, డిసెంబరు 9 : రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో మంగళవారం అత్యల్పంగా 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 20 జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపు నమోదు కావడం చలి తీవ్రతను సూచిస్తోంది. ఈ నెల 10-13 తేదీల మధ్య రాష్ట్రంలో పలు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6-8 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 12 తర్వాత రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయని, 7, 8 జిల్లాలు మినహా మిగిలిన అన్నిచోట్లా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. చలి తీవ్రతకు సంబంధించి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చలి గాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా మంగళవారం అర్లి(టి) గ్రామంలో 6.3, బజార్‌హత్నూర్‌లో 7.4, కెరమెరి మండలంలో 7.7, తాంసిలో 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 8, రాజేంద్రనగర్‌లో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.