Share News

cold wave: బాబోయ్‌ చలి

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:47 AM

రాష్ట్రంలో చలి, పొగ మంచు ప్రభావం కొనసాగుతోంది. చలి, పొగమంచుకి తోడు శీతలగాలుల ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో మంగళవారం....

cold wave: బాబోయ్‌ చలి

  • గిన్నెధరిలో 5.6, కోహీర్‌లో 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

  • రాష్ట్రంలో కొనసాగుతున్న చలి ప్రభావం

  • పది జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు

  • పొగ మంచు ప్రభావం.. రైళ్లు ఆలస్యం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో చలి, పొగ మంచు ప్రభావం కొనసాగుతోంది. చలి, పొగమంచుకి తోడు శీతలగాలుల ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో మంగళవారం 10 డిగ్రీల లోపు(సింగిల్‌ డిజిట్‌) కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 5.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లా సిర్పూర్‌(యు)లో 6.7, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 8.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, నిర్మల్‌, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, పెద్దపల్లి జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక, పొగమంచు వల్ల రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ 4 గంటల ఆలస్యంగా రాత్రి 7గంటలకు బయలు దేరింది. హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ 5.30గంటలు ఆలస్యంగా చేరుకోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. అలాగే, సికింద్రాబాద్‌కు రావాల్సిన దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లాల్సిన న్యూఢిల్లీ- యశ్వంత్‌పూర్‌ సంపర్క్‌క్రాంతి, న్యూఢిల్లీ-బెంగళూరు రాజధాని, నిజాముద్దీన్‌-తిరుపతి ఎక్స్‌ప్రె్‌సలు కూడా గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక, మంగళవారం తెల్లవారుజామున పొగ మంచు దట్టంగా కమ్మేయడం వల్ల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

Updated Date - Dec 31 , 2025 | 04:47 AM