Share News

Birthday Wishes Pour In for Telangana CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ సహా ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 02:24 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి శనివారం 57వ వసంతంలో అడుగు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రేవంత్‌ జన్మదిన వేడుకలు జరిపారు....

Birthday Wishes Pour In for Telangana CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ సహా ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

  • రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జన్మదిన వేడుకలు జరిపిన కాంగ్రెస్‌ శ్రేణులు

న్యూఢిల్లీ/ చెన్నై/ వికారాబాద్‌/ హైదరాబాద్‌, నవంబరు 8 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి శనివారం 57వ వసంతంలో అడుగు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రేవంత్‌ జన్మదిన వేడుకలు జరిపారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని నరేంద్రమోదీ పలువురు ప్రముఖులు శనివారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ.. రేవంత్‌ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫోన్‌ చేసి రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్ర మంత్రులు జి.కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ కుమార్‌, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

స్పీకర్‌ ప్రభృతుల శుభాకాంక్షలు

సీఎం రేవంత్‌ రెడ్డికి అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన రేవంత్‌ కుటుంబ వివాహ వేడుకలకు హాజరై ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి , కొండాసురేఖ, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులు సీఎం నివాసానికెళ్లి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ టాలీవుడ్‌ నటులు చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.

రేవంత్‌ను కలిసిన నీలం మధు

పటాన్‌చెరు: కాంగ్రెస్‌ నేత నీలం మధు సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్‌ బీసీ అయిన నవీన్‌యాదవ్‌కు టికెట్‌ ఇచ్చిందని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 02:24 AM