Minister Ponnam Prabhakar: రామయ్య మాస్టారూ...వందనం
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:49 AM
ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు....
విద్యావేత్త చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
రామయ్యను సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం శత వసంత జన్మదినోత్సవం జరుపుకుంటున్న చుక్కా రామయ్య మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. యువత భవితకు బంగారు బాటలు వేసి ఐఐటీ రామయ్యగా పేరు గాంచి, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన మేధావి చుక్కా రామయ్య అని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు. ఇక, హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉన్న చుక్కా రామయ్య నివాసానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్.. చుక్కా రామయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో చుక్కా రామయ్య శత వసంతాల అభినందన వేడుకను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేస్తామని పేర్కొన్నారు. మంత్రి పొన్నంతోపాటు ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, హరగోపాల్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, పల్లా రాజేశ్వరరెడ్డి, బాసర సరస్వతీ దేవీ ఆలయ అధికారిణి అంజనీ దేవి తదితరులు చుక్కా రామయ్యను ఆయన ఇంట్లో స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, వయోభారం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా కదల్లేని పరిస్థితిలో ఉన్న చుక్కా రామయ్య... తనను పరామర్శించడానికి వచ్చిన వారందరినీ గుర్తుపట్టారు. ప్రతి ఒక్కరిని పేరుతో పిలుస్తూ పలకరించారు.