Share News

Birthday Bumps: బర్త్‌ డే బంప్స్‌..ప్రాణాలమీదకు తెచ్చింది!

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:49 AM

బర్త్‌ డే బంప్స్‌ కేక్‌ కట్‌ చేశాక.. బర్త్‌ డే బాయ్‌/గాళ్‌కు అభినందనల పేరుతో మీద పడి ఇష్టంవచ్చినట్లు పిడిగుద్దులు కురిపించే ఓ వికృత క్రీడ...

Birthday Bumps: బర్త్‌ డే బంప్స్‌..ప్రాణాలమీదకు తెచ్చింది!

  • బడిలో వికృత క్రీడతో తొమ్మిదోక్లాసు విద్యార్థికి తీవ్రగాయాలు

  • నాచారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్లో ఘటన

  • ఆస్పత్రికి తరలింపు.. వృషణాలకు శస్త్రచికిత్స

  • 3నెలల పాటు బెడ్‌రెస్ట్‌ తప్పనిసరి అన్న వైద్యులు

  • ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు

తార్నాక, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): బర్త్‌ డే బంప్స్‌! కేక్‌ కట్‌ చేశాక.. బర్త్‌ డే బాయ్‌/గాళ్‌కు అభినందనల పేరుతో మీద పడి ఇష్టంవచ్చినట్లు పిడిగుద్దులు కురిపించే ఓ వికృత క్రీడ! పుట్టినరోజు సెలిబ్రేషన్‌ పేరుతో ఈ భయానక పోకడ, తాజాగా ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. తరగతి గదిలో బర్త్‌డే బంప్స్‌ పేరుతో తోటి విద్యార్థుల వెర్రి, మూర్ఖపు చేష్టలతో తొమ్మిదో తరగతి విద్యార్థి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఈ ఘోరం వెలుగుచూసింది. ఆగస్టు 29న ఆ బాబు పుట్టినరోజు కావడంతో మధ్యాహ్నభోజన విరామ సమయంలో తొటి విద్యార్థులు బర్త్‌డే బంప్స్‌ నిర్వహించారు. బాధితుడి మర్మాంగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వృషణాలు ఉబ్బిపోయి.. బ్లీడింగ్‌ అయింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్‌, బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు, తమ బిడ్డను మెరగైన వైద్యం కోసం బంజారహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అకడి వైద్యులు బాధితుడికి శస్త్రచికిత్స నిర్వహించారు. 3నెలలపాటు బాలుడికి బెడ్‌రెస్ట్‌ తప్పనిసరి అని వైద్యులు సూచించారు. వృషణాలకు ఆపరేషన్‌ చేయడం వల్ల బాలుడికి ప్రాణాపాయం తప్పిందని నాచారం పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదుతో బాధ్యులైన విద్యార్థులు, పాఠశాల యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 18 , 2025 | 04:49 AM