Share News

Kurnool Bus Fire: నిర్లక్ష్యపు నిప్పు!

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:10 AM

ఏపీలోని కర్నూలు జిల్లాలో 19 మంది ప్రయాణికులను బలిగొన్న ఘోర బస్సు ప్రమాద ఘటనకు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని తేలింది....

Kurnool Bus Fire: నిర్లక్ష్యపు నిప్పు!

  • కర్నూలు దుర్ఘటనలో కీలక మలుపు.. బస్సు రాకముందే డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

  • మద్యం మత్తులో బైక్‌ నడిపిన శివశంకర్‌ మృతి.. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌

  • ఇదే మార్గంలో బెంగళూరు వెళ్లిన 3 బస్సులు.. బైక్‌ను గమనించి పక్కనుంచి వెళ్లిన డ్రైవర్లు

  • వేమూరి కావేరి బస్సు డ్రైవర్‌ మాత్రం బైక్‌ను తోసుకుంటూ ముందుకెళ్లడంతో ప్రమాదం

  • 19 మంది ప్రయాణికులు సజీవదహనం.. అధికారికంగా నిర్ధారించిన పోలీసులు

కర్నూలు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని కర్నూలు జిల్లాలో 19 మంది ప్రయాణికులను బలిగొన్న ఘోర బస్సు ప్రమాద ఘటనకు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని తేలింది. ఈ బస్సు రావడానికి ముందే బైక్‌ డివైడర్‌ను ఢీకొని, రోడ్డు మధ్యలో పడిపోయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడిక్కడే మరణించగా, మరొకరు గాయపడ్డారని వెల్లడైంది. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడుపుతూ.. రోడ్డుపై ఉన్న బైకును తోసుకుంటూ వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తేలింది. కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్‌ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బస్సు దుర్ఘటనపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు విచారణ బృందం శుక్రవారం రాత్రే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. కర్నూలు నగరం నుంచి చిన్నటేకూరు సమీపంలో ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బస్సు తగలబడిపోవడానికి కారణమైన పల్సర్‌ బైక్‌పై మృతుడు శివశంకర్‌తోపాటు స్నేహితుడు సి.ఎర్రిస్వామి కూడా ఉన్నట్టు గుర్తించి విచారించారు.

ముందు ఏం జరిగిందంటే..?

కర్నూలు శివారులోని బి.తాండ్రపాడు గ్రామం ప్రజానగర్‌లో నివాసం ఉంటున్న బి.శివశంకర్‌, తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన సి.ఎర్రిస్వామి స్నేహితులు. గురువారం రాత్రి ఇద్దరూ కర్నూలులో భోజనం చేశారు. ఎర్రిస్వామిని అతడి స్వగ్రామం తుగ్గలి మండలం రాంపల్లిలో దింపేందుకు శివశంకర్‌ తన బైక్‌పై ఎక్కించుకొని గురువారం అర్ధరాత్రి బయలుదేరాడు. ‘వర్షం వస్తోంది.. ఉదయమే వెళ్తా’ అని ఎర్రిస్వామి వారించినా వినలేదు. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి-44లో చిన్నటేకూరు సమీపంలో కియా కార్ల షోరూం ఎదురుగా ఉన్న ఓ బంకులో రూ.300 పెట్రోల్‌ పట్టించుకున్నారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 2:24 గంటలు. ఆ బైక్‌కు హెడ్‌లైట్‌ వెలగడం లేదని, లెఫ్ట్‌ ఇండికేటర్‌ వెలుతురులోనే వారు వెళ్లారని బంకు సిబ్బంది తెలిపారు. తర్వాత 2:42 గంట లకు ఆరంఘర్‌ హోటల్‌ వద్ద వారు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యారు. అక్కడి నుంచి 2కి.మీ. వెళ్లాక 2:45 గంటలకు బైక్‌ కుడివైపు డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై పడిపోయింది. వెనుక కూర్చున్న ఎర్రిస్వామి డివైడర్‌ మధ్యలో గడ్డిపై పడటంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై పడిపోయిన బి.శివశంకర్‌ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. చలనం లేని మిత్రుడిని ఎర్రిస్వామి రోడ్డు పక్కకు లాగారు. ఆ తర్వాత పది నిమిషాల వ్యవధిలో ఓ ఆర్టీసీ బస్సు సహా 3 బస్సులు బెంగళూరు వైపు వెళ్లాయి. వాటి డ్రైవర్లు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను గమనించి పక్క నుంచి తీసుకెళ్లారు.


ఆ బైక్‌ను రోడ్డుపైనుంచి పక్కకు లాగేద్దామని ఎర్రిస్వామి ప్రయత్నించారు. 2:55 గంటలకు వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు వచ్చింది. రోడ్డుపై పడిఉన్న బైక్‌ను తోసుకుంటూ వెళ్లింది. భారీ శబ్దం రావడంతో డ్రైవర్‌ బ్రేక్‌ వేసి వదిలి, ముందుకు వెళ్లాడు. మళ్లీ భారీ శబ్దం రావడంతో మరోసారి బ్రేక్‌వేసి వదిలాడు. ఈ క్రమంలో బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్‌ ట్యాంక్‌మూత తెరుచుకొని పెట్రోల్‌ రోడ్డుపై కారుతూ వచ్చింది. బైక్‌, రోడ్డు మధ్య రాపిడితో నిప్పురవ్వలు ఎగిసి పెట్రోల్‌ అంటుకుంది. క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. 15 నిమిషాల్లో ఘోరం జరిగిపోయింది. ఏపీకి చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన ఆరుగురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఇద్దరు, బిహార్‌, ఒడిశాకు చెందిన ఒక్కొక్కరు, గుర్తు తెలియని మరో వ్యక్తి కలిపి 19మంది మంటల్లో సజీవదహనం అయ్యారు.

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం..

ప్రమాద ఘటనకు ప్రైవేటు బస్సు డ్రైవర్‌ మిరియాల లక్ష్మయ్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎంత వర్షం పడుతున్నా బస్సు హెడ్‌ లైట్‌ వెలుతురులో రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను గుర్తించకపోవడం బాధ్యతారాహిత్యమని అంటున్నారు. బైక్‌ను ఢీకొనగానే దఢేల్‌మని భారీ శబ్దం వచ్చిందని ప్రయాణికులు చెబుతున్నారు. శబ్దం రాగానే బ్రేక్‌ వేసి వదిలేశానని డ్రైవర్‌ లక్ష్మయ్య కూడా పోలీస్‌ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. తక్షణమే బస్సు ఆపేసి కిందకు దిగి, ఏం జరిగిందో గుర్తించి ఉంటే 19 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యేవి కావని సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు అంటున్నారు. బస్సు ముందు భాగం లో పల్సర్‌ బైక్‌ ఇరుక్కుపోయినా డ్రైవర్‌ అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా దాదాపు 200 మీటర్ల వరకు బస్సును వేగంగా ముందుకు పోనిచ్చారని, అప్పటికే బస్సుకు మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 04:10 AM