Share News

Accident: బైకును ఢీకొన్న ఇసుక లారీ

ABN , Publish Date - Oct 13 , 2025 | 08:05 AM

హైదరాబాద్‌లోని బేగంపేట గ్రిన్‌ల్యాండ్స్‌ చౌరస్తా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Accident: బైకును ఢీకొన్న ఇసుక లారీ

  • వైద్యుడితో పాటు ర్యాపిడో డ్రైవర్‌ మృతి

పంజాగుట్ట, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బేగంపేట గ్రిన్‌ల్యాండ్స్‌ చౌరస్తా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనాన్ని ఇసుక లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వైద్యుడితో పాటు ర్యాపిడో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఖమ్మం జిల్లా హవేలి రూరల్‌ మండలానికి చెందిన ఎం.నవీన్‌ (30) జేఎన్‌టీయూ సమీపంలో నివాసం ఉంటూ ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బేగంపేట్‌ కుందన్‌బాగ్‌లో నివాసం ఉంటూ బేగంపేటలోని కిమ్స్‌-సన్‌షైన్‌ ఆస్పత్రిలో జనరల్‌ ఫిజిషియన్‌గా పనిచేస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన డాక్టర్‌ కస్తూరి జగదీశ్‌ చంద్ర (35) ఆదివారం తెల్లవారుజామున ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసుకోగా నవీన్‌ తన హోండా యాక్టివా ద్విచక్ర వాహనంపై అతడిని ఎక్కించుకుని బయలుదేరాడు. మార్గమధ్యలో గ్రిన్‌ల్యాండ్‌ చౌరస్తా వద్ద యూసు్‌ఫగూడ వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ (టీఎస్ 09యూడి9279) వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ర్యాపిడో డ్రైవర్‌ నవీన్‌ లారీ వెనుక చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న డాక్టర్‌ జగదీశ్‌ డివైడర్‌పై పడి మృతి చెందారు. డాక్టర్‌ జగదీశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పి.శంకర్‌ (38)ను అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 13 , 2025 | 08:06 AM