Bhuvanagiri Youth Kidnapped: ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:08 AM
జీవనోపాధి కోసం పరదేశం వెళ్లిన యువకుడు ఉగ్ర మూక చెరలో చిక్కాడు.. ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియని పరిస్థితి..
దక్షిణాఫ్రికాలో బోర్‌వెల్ కంపెనీలో విధులు
కిడ్నాప్ చేసిన ‘జేఎన్‌ఐఎం’ ఉగ్రవాదులు
గత నెల 23న ఘటన.. ఆలస్యంగా సమాచారం
భువనగిరి రూరల్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): జీవనోపాధి కోసం పరదేశం వెళ్లిన యువకుడు ఉగ్ర మూక చెరలో చిక్కాడు.. ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియని పరిస్థితి.. తమ బిడ్డ ఆచూకీ తెలుసుకుని అతడిని కాపాడాలని తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెల 23న ఈ ఘటన జరగ్గా, ఈ నెల 4న అతని తల్లిదండ్రులకు సమాచారం అందింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య, మహేశ్వరి దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఓ బోర్‌వెల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ తరఫున గత ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికా దేశంలోని మాలి రాష్ట్రంలో కోబ్రి ప్రాంతానికి వెళ్లాడు. రోజూ ఉదయం 9 గంటల సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. గత నెల 22న చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడాడు. మరుసటి రోజు నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 4న బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతడు కిడ్నాప్ అయ్యాడని సమాచారమిచ్చారు. గత నెల 23న ప్రవీణ్ విధులు ముగించుకుని తాను ఉంటున్న గది వద్దకు వెళుతుండగా మార్గం మధ్యలో జేఎన్‌ఐఎం సంస్థకు చెందిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని తెలిపారు. గతంలోనూ ఆ ప్రాంతంలో అదే సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేశారు. బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు భారత రాయబార కార్యాలయం అధికారులతో ప్రవీణ్ ఆచూకీ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించేలా దక్షిణాఫ్రికా దేశాన్ని కోరాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రవీణ్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.