Bhatti Vikramarka: భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:15 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. మరో మూడేళ్లతో....
ప్రచారం చివరిరోజు మంత్రులతో సమన్వయం, ప్రత్యేక భేటీ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
హరీశ్‌కు మతిభ్రమించింది: భట్టి
ఎర్రగడ్డ/యూసు్‌ఫగూడ/బోరబండ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. మరో మూడేళ్లతో పాటు వచ్చే ఐదేళ్లూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆదివారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని మోతీనగర్‌కు వెళ్లారు. అక్కడ మంత్రి జూపల్లితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం స్థానిక డివిజన్లో పరిస్థితిని మంత్రి జూపల్లితో ప్రత్యేకంగా భేటీ అయి సమన్వయం చేశారు. ఆ తర్వాత యూసు్‌ఫగూడ డివిజన్‌కు చేరుకొని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక నేతలతో భేటీ అయి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత వెంగళరావు డివిజన్‌లో మంత్రి తుమ్మల, వాకిటి శ్రీహరితో భేటీ అయ్యారు. అనంతరం రహమత్ నగర్ డివిజన్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో, బోరబండ డివిజన్‌లో సీతక్కతో సమీక్ష నిర్వహించారు. చివరగా యూసు్‌ఫగూడలో పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బలహీనవర్గాల వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, పదవి లేకున్నా అనేక సామాజిక కార్యక్రమాలు చేసిన వ్యక్తి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. తనకు ఢిల్లీలో ఇల్లు ఉందా, లేదా? అనేది అందరికీ తెలుసని, హరీశ్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు రేషన్ కార్డులు అందించామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 14,230 కార్డులు ఇచ్చామని తెలిపారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి 30 వేల నుంచి 50 వేల మెజారీటీతో గెలుస్తారని, ఫేక్ సర్వేలు చేయించుకున్న బీఆర్‌ఎస్ భ్రమలో ఉందని అన్నారు.