Share News

Deputy CM Bhatti Vikramarka: బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేమూ వస్తాం

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:55 AM

కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు బీసీ బిల్లు ఆమోదం కోసం ప్రధానిమోదీ...

Deputy CM Bhatti Vikramarka: బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేమూ వస్తాం

  • బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది

  • పార్లమెంట్‌లో బిల్లు పెట్టకుండా జాప్యం

  • నేటి బంద్‌లో అందరూ పాల్గొనాలి: భట్టి

ఖమ్మం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు బీసీ బిల్లు ఆమోదం కోసం ప్రధానిమోదీ, రాష్ట్రపతి వద్ద సమయం తీసుకోవాలని, వారి నాయకత్వంలోనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తే వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగే బీసీ బంద్‌లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లును బీజేపీ అడ్డుకుంటోందని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టకుండా ఆ పార్టీ జాప్యం చేస్తోందని భట్టి ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఖరిపై కాంగ్రెస్‌ పక్షాన దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని చేసి కేంద్రానికి పంపితే.. పార్లమెంట్‌లో బిల్లు చేయకుండా బీజేపీ వ్యవహరించిన తీరుతో రిజర్వేషన్ల అమల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పార్లమెంట్‌లో బిల్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రధాని, రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్తే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు రిజర్వేషన్‌ బిల్లు అమలుకోసం వారి ఆధ్వర్యంలో ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ తీసుకెళ్తే వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2018లో కేసీఆర్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతం మించకుండా చట్టం చేసిందని, ఆ చట్టాన్ని తొలగిస్తూ ఆర్డినెన్సు ఇచ్చామని చెప్పారు. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ రెండు బిల్లులను ఏకగ్రీవంగా అమోదించి గవర్నర్‌కు పంపామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిషన్‌ను నియమించామని, అన్ని దశల్లో తగు చర్యలు తీసుకుని ప్రభుత్వం జాగ్రత్తలు పాటించిందని చెప్పారు. ప్రధాని, రాష్ట్రపతిని కలిసేందుకు అనేకసార్లు ప్రయత్నించినా అనుమతివ్వలేదన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో రిజర్వేషన్‌ బిల్లుపై అనుభవం కలిగిన అభిషేక్‌సింగ్వి, రవివర్మ లాంటి న్యాయవాదులను ప్రభుత్వం నియమించి కొట్లాడిందన్నారు. 42ు రిజర్వేషన్‌ అమల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం,పార్టీకి చిత్తశుద్ధి ఉందన్నారు.కాగా సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌గా 400 కోట్లు విడుదల చేశామని భట్టి వెల్లడించారు.

Updated Date - Oct 18 , 2025 | 04:55 AM