Deputy CM Bhatti Vikramarka: అజారుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోనివ్వకుండాబీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:36 AM
క్రీడారంగంలో దేశానికి, తెలంగాణకు పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన హైదరాబాద్ బిడ్డ.. మహమ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటుంటే స్వాగతించాల్సిందిపోయి...
ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది
ప్రమాణం చేయించకుండాగవర్నర్‌పై ఒత్తిడి
బీఆర్‌ఎ్‌సకు లాభం చేసే కుట్ర
బీజేపీ, బీఆర్‌ఎ్‌సల కుట్రలను
మైనారిటీలు అర్థం చేసుకోవాలి: భట్టి
హైదరాబాద్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): క్రీడారంగంలో దేశానికి, తెలంగాణకు పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన హైదరాబాద్ బిడ్డ.. మహమ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటుంటే స్వాగతించాల్సిందిపోయి అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. సుదీర్ఘ కాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజారుద్దీన్.. క్రికెట్ రంగంలో దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని, ఇందులో భాగంగానే అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనివ్వద్దంటూ ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు మేలు చేయడం కోసమే బీజేపీ ఈ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సల తెర వెనక బంధం గురించి కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పటికే బయటపెట్టారని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సహకారంతోనే రాష్ట్రంలో బీజేపీ 8 సీట్లు గెలుచుకుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నాయకులకు తెలుసని, అందుకే బీఆర్‌ఎ్‌సకు లాభం కలిగించేందుకు బలహీనమైన అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించిందని ఆరోపించారు. అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్‌పైనా బీజేపీ ఒత్తిడి తెస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. కానీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గొప్ప వ్యక్తి అని, ఆయన ఒత్తిళ్లకు లోను కారనే తాము భావిస్తున్నామని చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రం కరణ్‌పూర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు 20 రోజుల ముందు బీజేపీ అభ్యర్థి సురేంద్రసింగ్ పాల్‌ను ఆ పార్టీ మంత్రివర్గంలోకి తీసుకుందని భట్టి చెప్పారు. ఇక్కడ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, ఆయన ప్రమాణ స్వీకారం జరిగేది కూడా నియోజకవర్గం వెలుపలేనని గుర్తుచేశారు. పైగా అజారుద్దీన్‌ను శాసనమండలి సభ్యునిగా నియమించాలని మంత్రివర్గం తీర్మానం కూడా చేసిందన్నారు. సురేంద్రసింగ్, అజారుద్దీన్‌ల విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు తేటతెల్లమవుతున్నాయన్నారు. మైనారిటీ అన్న ద్వేషంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారాన్ని బీజేపీ అడ్డుకుంటోందని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సల కుట్రలను మైనారిటీలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీ నేత అజారుద్దీన్‌కు చోటు కల్పిస్తుంటే ఓర్చుకోలేని బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు.. ఆయనపై కుట్రలు పన్నుతున్నాయని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. మైనారిటీలంటే ఎందుకంత కడుపుమంట అని ఆ పార్టీలను నిలదీశారు. మైనారిటీలంటే బీజేపీ, బీఆర్‌ఎ్‌సలకు నచ్చదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. .
బీఆర్‌ఎ్‌సకు బీజేపీ సాయం: మహేశ్
నిజామాబాద్: బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎ్‌సను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ దుయ్యబట్టారు. బీజేపీ గెలిచే అవకాశం లేదని.. అక్కడి మైనార్టీ ఓట్లు బీజేపీకి పడవని తెలిసి వాటిని బీఆర్‌ఎ్‌సకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.