Share News

Bhathukamma Festival: నేటి నుంచే బతుకమ్మ సంబురాలు..

ABN , Publish Date - Sep 21 , 2025 | 06:21 AM

బతుకమ్మ సంబురాలకు వేళైంది. మహాలయ అమావాస్య సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి పల్లె పల్లెలో.. వాడ వాడలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటాపాటలే కనిపించనున్నాయి.

Bhathukamma Festival: నేటి నుంచే బతుకమ్మ సంబురాలు..

  • నేటి నుంచి బతుకమ్మ పండుగ ఉత్సవాలు

  • ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • వరంగల్‌లో ప్రారంభ వేడుకలు.. పాల్గొననున్న మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క

  • ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక: రేవంత్‌

  • కళాకారులకు ‘యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ చాలెంజ్‌’

  • తొలి బహుమతి 3 లక్షలు.. పోస్టర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌, సిద్దిపేట, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ సంబురాలకు వేళైంది. మహాలయ అమావాస్య సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి పల్లె పల్లెలో.. వాడ వాడలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటాపాటలే కనిపించనున్నాయి. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రారంభ వేడుకలు వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి వద్ద జరుగుతాయి. అక్కడ ప్రారంభ వేడుకల్లో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సీఎం రేవంత్‌ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ అనేది పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే పండుగ అని, ఇది ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అని ఆయన అన్నారు. సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు పండుగను ఆటపాటలతో వైభవంగా జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను రేవంత్‌ ప్రార్ధించినట్లుగా సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, కోమటిరెడ్డి.. ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డీసీ) ద్వారా నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ చాలెంజ్‌’ పోస్టర్‌ను ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళారూపాలు, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వీడియోలను రూపొందించి యువ కళాకారులు తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటాలని, బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.


కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజును మంత్రి ప్రత్యేకంగా అభినందిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికైన విజేతల్లో.. ప్రథమ బహుమతిగా రూ. 3లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ. 2 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.లక్ష అందించనున్నారు. కన్సోలేషన్‌ బహుమతి కిందఐదుగురికి రూ.20వేల చొప్పున ఇస్తారు. లఘు చిత్రాలయితే 3 నిమిషాలు, పాటలయితే 5 నిమిషాల నిడివి మించకూడదని తెలిపారు. ఎంట్రీలను youngfilmmakerschallange@gmail.com కు లేదా 8125834009 అనే వాట్స్‌ప నంబర్‌కు గానీ పంపాలని తెలిపారు. ఎంట్రీలను పంపించేందుకు గడువు ఈ నెల 30 అని వెల్లడించారు. కాగా, అన్ని జిల్లాకేంద్రాల్లో 30న సద్దుల బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


నేడు చింతమడకకు కవిత

బతుకమ్మ వేడుకల కోసం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం కేసీఆర్‌ స్వగ్రామమైన సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడక గ్రామానికి రానున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు శివాలయం, పట్టాభి సీతారామచంద్రాస్వామి గుడిలో బతుకమ్మతో దర్శనం చేసుకొని, గుడి ముందున్న మైదానంలో బతుకమ్మ ఆడనున్నారు.

బతుకమ్మ ఎక్కడ ‘తల్లీ’?

ఓ విగ్రహం చేతిలో బతుకమ్మ లేదు.. మరో విగ్రహం చేతిలో బతుకమ్మ ఓ పక్కకు ఒరిగిపోయింది. కేసీఆర్‌ సొంత గ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడకలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాల పరిస్థితి ఇది. ఆదివారం బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పల్లెలో తెలంగాణ తల్లి విగ్రహాల దయనీయ స్థితిపై గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

- ఆంధ్రజ్యోతి, సిద్దిపేట రూరల్‌

Updated Date - Sep 21 , 2025 | 07:25 AM