Bhadrachalam: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించిన ఐటీడీఏ పీవో సతీమణి
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:22 AM
భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ సతీమణి మనీషా శుక్రవారం తెల్లవారుజామున ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
భద్రాచలం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ సతీమణి మనీషా శుక్రవారం తెల్లవారుజామున ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె గర్భం దాల్చిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలోనే చెకప్ చేయించుకున్నారు. పురిటినొప్పులు రావడంతో గురువారం సాయంత్రం ఆసుపత్రికి తీసుకెళ్లగా సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో సిజేరియన్ ద్వారా ఆమెకు డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
పంద్రాగస్టు రోజున తల్లిదండ్రులైన పీవో దంపతులకు వైద్యులు, సిబ్బంది, పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సర్కారీ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు పీవో రాహుల్ దంపతులు చేసిన ప్రయత్నాన్ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు ఆస్పత్రికి వెళ్లి అభినందించారు.