మాటలు నమ్మి.. గూడు తీసేశాడు
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:18 AM
ఇల్లు మంజూరు చేయిస్తామని నాయకులు హామీ ఇవ్వడంతో సంతోషపడ్డాడు ఓ నిరుపేద. ఇల్లు వస్తుందని నమ్మకంగా చెప్పడంతో నమ్మిన అతను ఉన్న గూడు కూల్చుకున్నాడు.
ఉన్న గుడిసె కూలగొట్టుకున్న నిరుపేద
ప్రస్తుతం కమ్యూనిటీహాల్‌లో నివాసం
శాలిగౌరారం, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఇల్లు మంజూరు చేయిస్తామని నాయకులు హామీ ఇవ్వడంతో సంతోషపడ్డాడు ఓ నిరుపేద. ఇల్లు వస్తుందని నమ్మకంగా చెప్పడంతో నమ్మిన అతను ఉన్న గూడు కూల్చుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు రాదని చేతులెత్తేయడంలో ఆందోళన చెందుతున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలకేంద్రంలో జరిగింది. శాలిగౌరారంలోని ఎస్సీకాలనీకి చెందిన బట్ట రాజు ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్న గదిలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముం డేవాడు. ఇల్లు మంజూరు చేయిస్తామని గ్రామంలోని కొంతమంది నాయకులు చెప్పారు. కొన్నిరోజుల తర్వాత ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని చెప్పడంతో ఉన్న గుడిసె కూలగొట్టి పాత ఇంటి స్థలాన్ని శుభ్రం చేసుకొని కొత్త ఇంటి నిర్మాణం కోసం రాయి, ఇసుక పోయించుకున్నాడు. ఇటీవల ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు అందజేసినప్పుడు అందులో తన పేరు లేకపోవడంతో రాజు తీవ్ర నిరాశ చెందాడు. వెంటనే రాజు స్థానిక నాయకులను కలవగా, నీకు రెండో విడతలో మంజూరు చేస్తామని చెప్పారని తెలిపారు. మొదట జాబితాలో తన పేరు ఉందని, ఇప్పుడు కావాలని తన పేరు తొలగించారని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి సమీపంలోని హరిజన కమ్యూనిటీ హల్‌లో ఉంటున్నాడు. నాయకుల మాటలతో ఉన్న ఇల్లు కులగొట్టుకొని నిరాశ్రయుడిగా మారానని, తనకు మొదటి విడత లోనే ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను, నాయకులను వేడుకొంటున్నాడు. లేకపోతే చావే శరణ్యమని ఆందోళన చెబుతున్నాడు. శాలిగౌరారం రాజుకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఎంపీడీవో జ్యోతి లక్ష్మి తెలిపారు. ఒకవేళ అయన ఇందిరమ్మ ఇల్లుకు అర్హుడైతే ఎమ్మెల్యేతో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు.