kumaram bheem asifabad- మురిసేలోపు.. ముంచేసింది..
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:52 PM
పచ్చదనంతో కళకళలాడుతున్న సోయా పంటను చూసి మురిసిపోయిన రైతులకు అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు దెబ్బతీశాయి. ఏపుగా పెరిగి పూత, కాతతో ఉన్న సోయా పంటను భారీ వర్షాలు పూర్తగా దెబ్బతీశాయి. భారీ వర్షాలకు పంట చేలల్లో రోజుల తరబడి వరదనీరు నిలువ ఉండడంతో మొక్కలు కుళ్లిపోయాయి. పంట చేతికి అందే దశలో ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలు, గాలులకు పూత రాలి, కాయలు పగలడంతో ఆందోళనకు గురవు తున్నారు.
జైనూర్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పచ్చదనంతో కళకళలాడుతున్న సోయా పంటను చూసి మురిసిపోయిన రైతులకు అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు దెబ్బతీశాయి. ఏపుగా పెరిగి పూత, కాతతో ఉన్న సోయా పంటను భారీ వర్షాలు పూర్తగా దెబ్బతీశాయి. భారీ వర్షాలకు పంట చేలల్లో రోజుల తరబడి వరదనీరు నిలువ ఉండడంతో మొక్కలు కుళ్లిపోయాయి. పంట చేతికి అందే దశలో ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలు, గాలులకు పూత రాలి, కాయలు పగలడంతో ఆందోళనకు గురవు తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 945 ఎకరాలలో సోయాబిన్ సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సోయా సాగు చేసిర రైతులు ఇప్పటికే ఎకరానికి రు. 12వేల నుంచి రూ. 15 వేల వరకు పెట్టబడి కోసం వెచ్చిం చారు. పంట బాగా ఉండడంతో దిగుబడి సైతం ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావించారు. కానీ పంట చేతికి వచ్చే దశలో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో మొక్కపైనే కాయ పగిలి గింజలు నేల పాలవుతున్నాయి. ఏటా దసరా పండుగ ముందు సోయాబీన్ దిగుబడులు వచ్చేవి. ఈ ఏడాది కురుస్తున్న వర్షాలకు పంట ఎండిపోయినా వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలువ ఉంది. దీంతో సోయాబీన్ తీయాలన్నా బురద అంటుకోని ఉండడంతో ఏమి చేయలేక పోతున్నారు. కోత దశలో ఉన్న పంట క్షేత్రంలో నీరు నిలువ ఉండడంతో ఎలా తీయాలో దిక్కు తోచని స్థితిలో వేచి చూస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ అధికారుల సర్వే ప్రకారం 6,704 ఎకరాల్లో పంటు దెబ్బ తిన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 4.10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు గుర్తించారు. ప్రధానంగా పత్తి 3.35 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆగస్టు, సెప్టెంబరు నెలలో భారీ వర్షాలు కురువడంతో జల వనరులు నిండుకుండలా మారాయి. లోతట్టు, నది పరివాహక ప్రాంతాల్లో వేసిన పంటలు నీట మునిగి రైతులు నష్ట పోయారు. ప్రభుత్వం నష్టం అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.