kumaram bheem asifabad- అరచేతిలో అందం....ఆరోగ్యం
ABN , Publish Date - Jun 29 , 2025 | 10:39 PM
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అతివలకు గోరింటారు గుర్తుకువస్తుంది. ఆషాడం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెబుతారు. అతివలకు ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికాన్ని పెంపొందించే గోరింటారు సందడి ప్రారంభమైంది.
వాంకిడి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అతివలకు గోరింటారు గుర్తుకువస్తుంది. ఆషాడం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెబుతారు. అతివలకు ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికాన్ని పెంపొందించే గోరింటారు సందడి ప్రారంభమైంది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. గోరింటాకు మహిళల చేతులు, కాళ్లకు కొత్త అందాన్నిస్తుంది. యువతుల చేతికి గోరింటాకు ఎంత ఎర్రగా పండితే..అంత మంచి భర్త దొరుకుతాడని విశ్వసిస్తారు. గోరింటాకు శుభానికి చిహ్నంగా భావిస్తారు.
ఎందుకు పెట్టుకుంటారంటే..
ఆషాఢ మాసంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. వాతావరణం చల్లబడిపోతుంది. ఆ సమయంలో మన శరీరంలోని వేడి.. బయట వాతావరణానికి విరుద్దంగా తయారవు తుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే గోరింటాకుకు శరీరంలో వేడిని తగ్గించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలతో పాటు డాక్లర్లు కూడా చెప్తుంటారు.
- దోశాలను నివారిస్తుంది...
గోరింటాకును శుభకార్యాలు, పండుగలప్పుడు పెట్టుకోవడం అనవాయితి. కొన్ని సంప్రదాయాల ప్రకారం గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుందని స్త్రీ అరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు. ఆయుర్వేదంలో గోరింటాకు వేర్లు, బెరడు, ఆకులు, ఫూలు, విత్తనాలు అన్ని ఔషద గునాలు కలిగి ఉన్నాయని చెబుతారు. ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం స్త్రీలకు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. ఒంట్లోని వేడిని తగ్గిస్తుది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని చెబుతారు.
గౌరీదేవిని పూజించి..
- భాగ్య, వాంకిడి
ఆషాడంలో మహిళలను ఇంటికి ఆహ్వానించి గౌరీదేవి ప్రతిమకు పూజలు చేసి గోరింటాకు పెడుతాం. కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం అనవాయితీ. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్నా మనస్సు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.
ఆయుర్వేద గుణాలు ఉంటాయి..
- డాక్టర్ వాణి- ఆయుర్వేద విశ్రాంత వైద్యాధికారి
ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులేకాదు..ఫూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడడం మన పెద్దల వైద్యంలో ఉన్నదే. కేవలం ఆషాఢంలోనే కాదు.. శుభకార్యాల సందర్భాల్లోను గోరింటాకు పెట్టకోవడం మంచిది.