kumaram bheem asifabad- పురుగుల మందుతో జాగ్రత్త
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:43 PM
పంటలకు ఇటీవల కాలంలో రసాయనిక మందుల వాడకం గణనీయంగా పెరిగింది. వివిధ రకాల పురుగులు, తెగుళ్లను నివారించేందుకు రైతులు ప్రమాదకరమైన మందులను ఆశ్రయిస్తు న్నారు. కానీ పురుగుల మందు పిచికారి చేసే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల అస్వస్థతకు గురవుతున్నారు.
- నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం
- అధికారుల సూచనలు పాటిస్తే మేలు
పంటలకు ఇటీవల కాలంలో రసాయనిక మందుల వాడకం గణనీయంగా పెరిగింది. వివిధ రకాల పురుగులు, తెగుళ్లను నివారించేందుకు రైతులు ప్రమాదకరమైన మందులను ఆశ్రయిస్తు న్నారు. కానీ పురుగుల మందు పిచికారి చేసే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల అస్వస్థతకు గురవుతున్నారు.
వాంకిడి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అధిక దిగుబడినిచ్చే విత్తనాలను రూపొందిస్తుండగా, మరో వైపు ఆ పంటలపై ఆశించే చీడపీడల నుంచి పంటను కాపాడేందుకు రైతుల క్రిమిసంహరక మందులు వాడడం పరిపాటిగా మారింది. ఆయా పంటలకు జరిగే నష్టంలో దాదాపు 20-25 శాతం చీడపీడల వల్లే కలుగుతున్నట్లు శాస్త్రవే త్తలు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తి, వరిలో పురుగు నివారణకు రైతులు ఒక్కటికి రెండు సార్లు పురు గుల మందులు పిచికారి చేస్తున్నారు. రెండేళ్ల నుంచి జిల్లాలో పత్తి పంటపై పురుగు మందులు పిచికారి చేయడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ముగ్గురు రైతులు వృత్యు వాత పడ్డారు. పలువురు రైతులు పురుగు మందు ప్రభావంతో అస్వస్థతకు గురై చికిత్స పొందారు.
- అవగాహన లేక..
పురుగుల మందుల వాడకంపై రైతులకు పెద్దగా అవగాహన ఉండడంలేదు. గ్రామాల్లో ఫెర్టిలైజర్ డీలర్లు పురుగులమందుల వ్యాపారులు చెప్పె మందులనే పిచికారి చేస్తున్నారు. ఒక్కో కంపెనీ తయారు చేసే మందు ప్రభావం ఒక్కో రకంగా ఉంటుంది. ఇవి పిచికారి చేసే వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఏ పురుగుకు ఏ మోతాదులో ఏ మందు వాడాలో రైతులకు తెలియని పరిస్థితి ఉంది. కొన్ని రసాయన మందులు ఘాటైన వాసన ఉండి ఉంటే మరికొన్ని తేలికగా ఉంటాయి. రైతులు ఇవేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులను పిచికారి చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.
- పిచికారి సమయంలో నిర్లక్షం..
చాలా మంది రైతులు రసాయన మందులు పిచికారి చేసేటప్పడు బీడీలు, సిగరేట్లు తాగడం, గుట్కా నమలడం, తంబాకు నోట్లో వేసుకోవడం చేస్తుంటారు. అలాగే మధ్యాహ్న సమయంలో చేతులను సబ్బుతో కాకుండా కేవలం నీళ్లతో మీదమీద కడిగి భోజనం చేస్తుంటారు. దీంతో మందు ప్రభావం తమకు తెలియకుండానే వివిధ రూపాల్లో మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో మనిషి నాడి వ్యవస్థ, శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే గాలి ఏ వైపు నుంచి వీస్తుందో గమనించక ఇష్టమొచ్చినట్లు పిచికారి చేస్తుంటారు. దీంతో రసాయన మందు గాలిలో కలిసి శ్వాస తీసుకుంటున్నప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లి వాంతులు కావడం, తలతిప్ప డం, శరీరమంతా చెమటలు పట్టడం, సరైన శ్వాస అందకపోవడం వంటివి జరుగుతుంటాయి.
జాగ్రత్తలు పాటించాలి..
- ఎస్‌కే రియాజ్ - వైద్యాధికారి వాంకిడి
రైతులు, రైతు కూలీలు పిచికారి సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. స్ర్పేయర్లుకు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. మందు నీళ్లు శరీరంపై పడ కుండా లూజు దుస్తులు ధరించాలి. పిచికారి పూర్తయిన తర్వాత తలభాగం నుంచి సబ్బుతో స్నానం చేయాలి. పిచికారి చేసే వ్యక్తికి ఏవైనా గాయాలుంటే అవి కనబడకుండా ప్లాస్టర్ వేసుకో వాలి. పిచికారి సమయంలో ఏమైనా అనారోగ్యానికి గురైతే సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకె ళ్లాలి. మందు ప్రభావం ఎంత గాఢతదో తెలుసుకునేందుకు మందు డబ్బాను చూపించాలి.
సిఫారుసు మేరకు వాడాలి..
- గోపికాంత్, మండల వ్యవసాయ అధికారి
పురుగుమందులు ఏ సమయంలో వాడాలో చాలా మంది రైతులకు తెలియడం లేదు. ముందు గా సాగు చేసిన పంటలను రెండుమూడు రోజుల కోసారి పరిశీలించాలి. ఏ పురుగువల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే దానిపై అవగాహనకు వచ్చిన తర్వాత మందులు వాడాలి. రైతులు తప్పని సరిగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పురుగుమందులు పిచికారి చేయాలి.