Share News

BCs Sweep Panchayat Elections: పంచాయతీ బీసీ లదే!

ABN , Publish Date - Dec 19 , 2025 | 05:10 AM

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు విజయబావుటా ఎగురవేశారు. బీసీలకు రిజర్వు చేసిన స్థానాలకంటే కూడా ఎక్కువ సంఖ్యలో జనరల్‌ స్థానాలను వారే గెలుచుకున్నారు...

BCs Sweep Panchayat Elections: పంచాయతీ బీసీ లదే!

  • జనరల్‌ స్థానాల్లో 52.75 శాతం వెనుకబడిన వర్గాలదే గెలుపు

  • 5,190 జనరల్‌ సీట్లలో 2,738 స్థానాల్లో విజయబావుటా

  • రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 39.5 శాతం బీసీలకే

  • గిరిజన జిల్లాలను మినహాయిస్తే 45.25శాతం

  • పెద్దపల్లిలో 63%, మరో 10 జిల్లాల్లో 50%పైగా బీసీ సర్పంచులే

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు విజయబావుటా ఎగురవేశారు. బీసీలకు రిజర్వు చేసిన స్థానాలకంటే కూడా ఎక్కువ సంఖ్యలో జనరల్‌ స్థానాలను వారే గెలుచుకున్నారు. ఏకంగా 52.75 శాతం జనరల్‌ స్థానాలను దక్కించుకున్నారు. రాష్ట్రంలో 12,733 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. అందులో బీసీలకు 2,275 స్థానాలు రిజర్వు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం స్థానాలు కేటాయించారు. అన్ని రిజర్వేషన్లు పోగా 5,190 స్థానాలు జనరల్‌ కేటగిరీలో ఉన్నాయి. వీటిలో 2,738 స్థానాలు అంటే 52.75శాతం సర్పంచ్‌ పదవులను బీసీలే గెలుచుకున్నారు. అటు బీసీలకు రిజర్వు అయిన 2,275 స్థానాలూ వారికే అందాయి. మొత్తంగా బీసీలు 5,013 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం స్థానాలతో పోలిస్తే ఇది 39.5 శాతం. అయితే ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు సీట్లు రాలేని పరిస్థితి. ఇక్కడ మొత్తం 471 స్థానాలుంటే బీసీలకు ఒక్కటి కూడా రిజర్వ్‌ కాలేదు. 9 జనరల్‌ స్థానాలు ఉండగా, అందులో మూడు సీట్లు బీసీలు గెలుచుకున్నారు. జిల్లాలోని మొత్తం పంచాయతీల్లో ఇది 0.63 శాతమే. దీంతో ఈ జిల్లాను మినహాయించి చూస్తే.. మొత్తంగా 41.55 శాతం సర్పంచ్‌ స్థానాలను బీసీలే సాధించారు. ఏజెన్సీ ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, ములుగు, మహబూబాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలన్నీ మినహాయించి చూస్తే.. మిగతా జిల్లాల్లో బీసీలు గెలిచిన స్థానాలు 45.25శాతం కావడం గమనార్హం.

అత్యధికంగా పెద్దపల్లిలో..

మొత్తంగా చూస్తే.. హైదరాబాద్‌ పరిధి మిన హా మిగతా 31 జిల్లాలకుగాను.. పెద్దపల్లి జిల్లాల్లో అత్యధికంగా 63శాతం స్థానాలు బీసీలే గెలుచుకున్నారు. గద్వాల (58.43%), జగిత్యాల (58.18%), సిద్దిపేట (56.29), నారాయణపేట (54.77), కరీంనగర్‌ (54.74) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0.63ు, మహబూబాబాద్‌లో 10.6 శాతం విజయం సాధించారు.

Updated Date - Dec 19 , 2025 | 05:10 AM