BCs Protest: నవంబరు 25.. బీసీలకు చీకటి రోజు
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:03 AM
రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తామని అనేక సందర్భాల్లో హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం....
30న బీసీల యుద్ధభేరి నిర్వహిస్తాం
డిసెంబరు 8,9 తేదీల్లో చలో ఢిల్లీ: జాజుల
పంజాగుట్ట/హైదరాబాద్ నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 42ు బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తామని అనేక సందర్భాల్లో హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, దానిని విస్మరించి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నవంబరు 25ను బీసీలకు చీకటి రోజు, విద్రోహ దినంగా ప్రకటించారు. తెలంగాణలో బీసీలు సర్పంచులు కాకుండా కుట్రతో రిజర్వేషన్లు తగ్గించారని, రొటేషన్ పేరుతో బీసీల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘బీసీలకు జరిగిన అన్యాయం- భవిష్యత్ కార్యాచరణ’పై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ తదితరులతో కలిసి జాజుల మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినా, బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో బీసీల యుద్ధభేరి నిర్వహిస్తామని, డిసెంబరు 8,9 తేదీల్లో చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నామని, పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి 42ు రిజర్వేషన్లు సాధించుకుంటామని ఆయన అన్నారు.
బీసీల గొంతుకోసిన సర్కారు: ఆర్.కృష్ణయ్య
బర్కత్‌పుర: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాను యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేయడంతో బీసీలకు అన్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేయాలన్నారు. ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్‌లో బీసీ జేఏసీ కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రిజర్వేషన్లను 22శాతానికి తగ్గించి ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని ధ్వజమెత్తారు. జీవో 46ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42ు రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలన్నారు. జీవో 46ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తామని కృష్ణయ్య తెలిపారు.