Share News

BCs Protest Against Reduction of Reservation: రిజర్వేషన్లు తగ్గడంపై బీసీల ఆగ్రహం

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:48 AM

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...

BCs Protest Against Reduction of Reservation: రిజర్వేషన్లు తగ్గడంపై బీసీల ఆగ్రహం

  • జీవో 46ను రద్దు చేసి, 42ు రిజర్వేషన్‌ కల్పించాలి.. అప్పటి దాకా పంచాయతీ ఎన్నికలను ఆపేయాలి

  • లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం

  • ప్రభుత్వానికి బీసీ సంఘాల హెచ్చరిక

  • 29న రహదారుల దిగ్బంధం: కృష్ణయ్య

  • 30న బీసీల ధర్మయుద్ధ భేరి: జాజుల

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/కవాడిగూడ/రాంనగర్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, బీసీలకు 42ు రిజర్వేషన్లను చట్టబద్ధంగా కల్పించేవరకు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం భరతం పడతామని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు 42ు రిజర్వేషన్లు సాధించే వరకు బలమైన ఉద్యమం చేస్తామన్నారు. ఇందులో భాగంగా 29న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం చేయనున్నట్లు ప్రకటించారు. జీవో 46కు వ్యతిరేకంగా విద్యానగర్‌ బీసీ భవన్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణయ్య ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌ ఎన్నికల్లో బీసీలకు కేవలం 17ు రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలకు 42ు రిజర్వేషన్లను సాధించే వరకు విశ్రాంతి తీసుకోబోమన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు 42ు రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని సినీ నటుడు నారాయణమూర్తి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అంటేనే మోసం అనేది ప్రజలకు తెలిసిపోయిందని బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. జీవో 46ను వెంటనే రద్దు చేసి, సర్పంచ్‌ ఎన్నికలను వాయిదా వేయాలని ‘42ు బీసీ రిజర్వేషన్ల సాధన సమితి’ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వారు రాస్తారోకో నిర్వహించారు. అరగంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. బీసీ పొలిటికల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ‘‘ఏ సీఎం చేయని ద్రోహం రేవంత్‌రెడ్డి బీసీలకు చేశారు’’ అని ఆరోపించారు. బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో భాగస్వాములు కావాలని బీసీ పొలిటికల్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కన్వీనర్‌ అయిలి వెంకన్న గౌడ్‌ పిలుపునిచ్చారు. బీసీలను అణచివేసేందుకు కుట్రలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే అర్హత లేదని బీసీ పొలిటికల్‌ ఫ్రంట్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌ దుర్గయ్యగౌడ్‌ అన్నారు.


17.08ు రిజర్వేషన్‌తో అవమానిస్తారా?

42ు రిజర్వేషన్ల సాధనకై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఈ నెల 30న ఛలో హైదరాబాద్‌, బీసీల ధర్మయుద్ధ భేరి సభలను నిర్వహిస్తామని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ ప్రకటించారు. వేలాది మందితో సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మన్‌ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బీసీల ధర్మయుద్ద భేరి వాల్‌ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. నవంబర్‌ 25ను బీసీల విద్రోహ దినంగా పాటిస్తామన్నారు. కాగా, పలు బీసీ సంఘాల ప్రతినిధులు బుధవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ వారిని పరామర్శించారు.

Updated Date - Nov 27 , 2025 | 04:48 AM