Jajula Srinivas Goud: బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రం: జాజుల
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:01 AM
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
హైదరాబాద్/బర్కత్‌పుర, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రపతి భవన్, రాజ్‌భవన్‌లను కేంద్రం జేబు సంస్థగా మార్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాజుల మీడియాతో మాట్లాడారు. నాటి మండల్ నుంచి నేటి బీసీ బిల్లు వరకు బీజేపీ బీసీలను మోసం చేస్తూనే ఉందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమ కార్యాచరణకు గురువారం హైదరాబాద్‌లో బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.