BC Welfare Association: 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:27 AM
బీసీ జనాభా దామాషా ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే, ఆ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో తప్పనిసరిగా చేర్చాలని బీసీ....
ఇందుకోసం బీసీలంతా ఐక్య పోరాటాలు చేయాలి
ఇందిరాపార్కు వద్ద 24 గంటల దీక్షలో వక్తలు
మద్దతు ప్రకటించిన దత్తాత్రేయ, మధుసూదనాచారి
కవాడిగూడ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీసీ జనాభా దామాషా ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే, ఆ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో తప్పనిసరిగా చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఇందుకోసం బీసీలంతా పార్టీలకతీతంగా ఏకమై, ఐక్యంగా పోరాటాలు చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్రసత్యనారాయణ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో 24 గంటల దీక్షను చేపట్టారు. ఈ దీక్షను మాజీ స్పీకర్ సిరికొండ మధుసుధనాచారి ప్రారంభించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జస్టిస్ చంద్రకుమార్, మాజీ మంత్రి రాజేషం గౌడ్, తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు వీజీఆర్ నారగోని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్, పలు బీసీ సంఘాల నేతలు, న్యాయవాదులు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ అని, దీనికి కేవలం అసెంబ్లీ తీర్మానం సరిపోదని పార్లమెంటులో చట్టం కావాలన్నారు. తాను బీజేపీ సీనియర్ నేతగా పార్లమెంటులో ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ స్పీకర్ మధుసుధనాచారి మాట్లాడుతూ, 42 శాతం రిజర్వేషన్లను బీసీలంతా ఐకమత్యంగా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని, ఈ పోరాటంలో బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, దేశాన్ని పాలించే మనువాద పార్టీలు అగ్రవర్ణాలకు పెద్దపీట వేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పాల్గొన్నారు.