BC Reservations : బీసీ రిజర్వేషన్లు భిక్ష కాదు.. మా హక్కు
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:26 AM
బీసీ రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే భిక్ష కాదని.. తమ హక్కు అని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించే విషయమై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే...
సీఎం అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలి... పార్లమెంట్‌లో రాజ్యాంగాన్ని సవరించేలా ఒత్తిడి తేవాలి
బీసీలను మోసం చేస్తే రాష్ట్ర సర్కారుపై తిరుగుబాటే: జాజుల
బీసీ రిజర్వేషన్లపై మోదీతో మాట్లాడతా: బండారు దత్తాత్రేయ
ప్రభుత్వాలు పట్టింపులకు పోతే ఉవ్వెత్తున ఉద్యమం: కోదండరాం
ఇందిరా పార్క్ వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష
కవాడిగూడ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే భిక్ష కాదని.. తమ హక్కు అని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించే విషయమై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించే విషయమై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. ప్రధాని సమయం ఇవ్వకపోతే ఇండియా కూటమి తరఫున పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేయాలని.. కేంద్రంపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి, 9వ షెడ్యూల్‌లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో జాజుల ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఇందులో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ కోదండరాం, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మఽధుసూదనాచారి, ఎల్.రమణ, మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో పాటు 136 కుల సంఘాల రాష్ట్ట్ర అధ్యక్షులు, 40 బీసీ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీతో కొట్లాడుతారో, బీసీ దోషులుగా నిలబడతారో కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించేంతా వరకు బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్పారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీల వాటా బీసీలకు దక్కితేనే న్యాయం జరుగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోదీతో మాట్లాడతానని చెప్పారు. రాష్ట్రంలో జనాభా మేరకు రాజకీయ రంగంలో, రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు వాటా కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. కోదండరాం మాట్లాడుతూ.. బీసీల డిమాండ్ న్యాయమైనదని.. సమస్యను పరిష్కరించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలు పట్టింపులకు పోతే తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరాడితే బీఆర్‌ఎస్ కూడా మద్దతు ఇస్తుందన్నారు.