Share News

Supreme Court: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో విచారణ నేడే

ABN , Publish Date - Oct 16 , 2025 | 02:23 AM

తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ల కల్పన అంశంపై ఉత్కంఠ నెలకొంది. గురువారం జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది...

Supreme Court: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో విచారణ నేడే

  • సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న దానిపై ఉత్కంఠ

  • విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌

  • తదనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధం

  • నేడు మధ్యాహ్నం క్యాబినెట్‌ భేటీ.. స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చే చాన్స్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ల కల్పన అంశంపై ఉత్కంఠ నెలకొంది. గురువారం జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు కోర్టు ఏం చెబుతుంది? తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం, పీసీసీ నేతలు పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో.. మంత్రివర్గం ఏయే నిర్ణయాలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కొన్ని గంటల్లో బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

శాస్త్రీయంగా చేసినా హైకోర్టు స్టే..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఈ నెల 9న స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెష ల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్పీ) గురువారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. తెలంగాణలో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్లుగానే జరిగిందని ఈ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. నిజానికి రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లపై 50ు పరిమితి లేదని, గతంలో సుప్రీంకోర్టు కేవలం ఒక మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని పేర్కొంది. అయినా హైకోర్టు స్టే విధించిందని వెల్లడించింది.


మరెన్నో అంశాలపై కేబినెట్‌ భేటీ..

సీఎం రేవంత్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గురువారం మధ్యాహ్నం సచివాలయంలోని ఆరో అంతస్తులో భేటీకానుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది? తదనుగుణంగా ఏం చేయా లి? స్థానిక ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశాలపై చర్చించనుంది. దీనితోపాటు పలు సాగునీటి ప్రాజెక్టులు, కొన్ని ప్రాజెక్టుల డిజైన్ల మార్పునకు అనుమతులు, ధాన్యం కొనుగోలు, హైదరాబాద్‌ మెట్రోను ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవడం, రెండో దశ విస్తరణ, వైద్యారోగ్య రంగం బలోపేతం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4,150 కోట్ల రుణ సేకరణ, హ్యామ్‌ రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ రెండేళ్ల పాలన విజయోత్సవాలను ఘనంగా జరపాలని భావిస్తున్న నేపథ్యంలో ఏయే కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రామగుండంలో రూ.10,893.05 కోట్లతో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణం, యాదాద్రి థర్మల్‌ ప్లాంటు అంచనాల సవరణ అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకోన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 06:32 AM