BC Reservation : బీసీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం ఉధృతం
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:01 AM
తెలంగాణ ఉద్యమం తరహలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు...
నవంబరు 2న బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం
నవంబరు రెండో వారంలో నిరసన దీక్షలు, మూడో వారంలో ర్యాలీలు, ప్రదర్శనలు
బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం
బీసీ జేఏసీ ప్రతినిధులు
బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించం : జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమం తరహలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి బీసీలకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో సాధించే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తేలేదని వారు స్పష్టం చేశారు. బీసీ జేఏసీ వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, కో చైర్మన్ దాసు సురేష్, కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణలతో కలిసి ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న బీసీల రాష్ట్ర బంద్ విజయవంతం కావడంతో రిజర్వేషన్ వ్యతిరేకుల గుండెల్లో గుబులు రేగిందని, తెలంగాణలో బీసీల బలం, బలగాన్ని దేశమంతా చూసిందన్నారు. బీసీల రిజర్వేషన్ల ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉధృతం చేసే కార్యాచరణ రూపకల్పనకు నవంబరు2న హైదరాబాద్ కళింగభవన్‌లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. నవంబరు రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, మూడో వారంలో పల్లె నుంచి పట్నం వరకు పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రదర్శనలు చేపడతామన్నారు. బిహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కోరుతామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించే ప్రసక్తేలేదన్నారు. దాసు సురేష్ మాట్లాడుతూ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ స్వతంత్ర ఉద్యమాన్ని చేపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రైలు రోకో, రహదారుల దిగ్బంధంలాంటి కార్యక్రమాలు చేపట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నారగోని మాట్లాడుతూ రాజకీయ పార్టీలకతంగా తమతో కలిసి వచ్చే అందరిని కలుపుకొని రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. మండల్ కమిషన్, మురళీధర్ రావు కమిషన్ ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమ తరహలోనే బీసీ ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. సమావేశంలో బీసీ జేఏసీ కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.