JAJC Chairman Jajula Srinivas Goud: ప్రధానితో భేటీలోబీసీల ప్రస్తావన ఏది?
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:02 AM
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీతో జరిగిన భేటీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎందుకు చర్చించలేదని సీఎం రేవంత్‌రెడ్డిని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల....
బీజేపీ, కాంగ్రె్‌సల మోసాన్ని బీసీ సమాజం గమనిస్తోంది
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీతో జరిగిన భేటీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎందుకు చర్చించలేదని సీఎం రేవంత్‌రెడ్డిని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించాలని కోరలేదంటే ఆయనకు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టమవుతోందన్నారు. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నందునా.. బీసీ రిజర్వేషన్ల గురించి కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను నిర్వర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఈ భేటీ నిదర్శనమని విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చిన వినతిపత్రంలో కనీసం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించాలనే విషయాన్ని ప్రస్తావించకపోవడం అత్యంత దుర్మార్గమమన్నారు. రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం పార్లమెంటులో పోరాటం చేయాలని మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి కుక్కతోక వంకర అన్న చందంగా ఉందని, బీజేపీ, కాంగ్రెస్ చీకటి, లోపాయికారీ ఒప్పందం మూలంగానే బీసీ రిజర్వేషన్లపై బీజేపీని నిలదీయడం లేదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీల కపటనాటకాన్ని బీసీ సమాజం గమనిస్తోందన్నారు. బీసీలపై వారి కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగట్టి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.