TRS leader Harish Rao: బీసీల పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:11 AM
బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో...
రిజర్వేషన్ల పెంపు బిల్లు పెడితే మద్దతిస్తాం: హరీశ్
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతు ఇస్తుంటే... మరి ఆపుతున్నదెవరు? అని శనివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆరు సార్లు జనాభా లెక్కింపు చేపట్టిన కాంగ్రెస్.. ఏనాడూ బీసీ గణన చేయలేదని, బీజేపీ సైతం నాలుగేళ్లుగా జనగణన వాయిదా వేస్తూ వస్తోందని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు.. బీసీలపై కపట ప్రేమను నటిస్తున్నాయని మండిపడ్డారు. జిత్నా అబాదీ, ఉత్నా హక్ (మేమొంతో.. మాకంత) అని నినదించే రాహుల్‌గాంధీ పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లును ఎందుకు పెట్టడం లేదు? ఈ విషయంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదు? అని నిలదీశారు. రిజర్వేషన్ల పెంపు కోసం ఏ పార్టీ బిల్లు పెట్టినా.. బీఆర్‌ఎస్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి పోతుందని రైతులు కంటతడి పెడుతుంటే.. కాంగ్రెస్ నేతలు వాటాల కోసం కొట్టుకు చస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కాగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య శనివారం కేటీఆర్‌ను కలిశారు. గత ప్రభుత్వం హయత్‌నగర్‌లో తనకు కేటాయించిన భూమిని కొంతమంది కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన వెంటనే రంగారెడ్డి కలెక్టర్‌కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. కంటి సమస్య ఉందని మొగులయ్య ప్రస్తావించగా.. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు.