Mahesh Kumar Goud: హైకోర్టు స్టేపై సుప్రీంకు వెళతాం
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:06 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాజీ పడే ప్రసక్తే లేదని, హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు...
బీసీ రిజర్వేషన్లపై రాజీ లేదు
42శాతం కోటా ఇచ్చాకే స్థానిక ఎన్నికలు
అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్/నిజామాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాజీ పడే ప్రసక్తే లేదని, హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని, ప్రధాన ముద్దాయి బీజేపీ అని విమర్శించారు. శనివారం మహేశ్ గౌడ్ నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మాకు దమ్ము ధైర్యం ఉన్నందునే బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామ’ని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేసిన ధర్నాకు బీజేపీ నేతలు ఎందుకు ముఖం చాటేశారో జవాబు చెప్పాలన్నారు. ‘బీసీల నోటి కాడ ముద్దను బీజేపీ, బీఆర్‌ఎస్ లాగేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులకు లేదన్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా ముంబై రైల్వే లైన్ విషయమై సీఎంతో చర్చించినట్టు తెలిపారు. కామారెడ్డి బీసీ సభ తప్పకుండా నిర్వహిస్తామన్నారు. బనకచర్ల విషయంలో ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బనకచర్ల జీవోలు విడుదల అయ్యాయని, మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పులు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.