TPCC chief Mahesh Kumar Goud: బీసీలకు రిజర్వేషన్.. కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనం
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:04 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు..
42% రిజర్వేషన్ల జీవోపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
బీసీ రిజర్వేషన్లను అందరూ ఆహ్వానించాలి: పొన్నం
బీసీల రాజ్యాధికారానికి ఇది తొలి అడుగు: వాకిటి శ్రీహరి
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీల అభివృద్ధి చెందాలన్న విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధికి ఈ జీవో నిదర్శనమని పేర్కొన్నారు. బీసీల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాలు సహకరించి రిజర్వేషన్ల అమలయ్యేలా చూడాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన జీవోను అందరూ ఆహ్వానించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బీసీ రిజర్వేషన్లతో ఎవరికీ నష్టం లేదని, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండబోదని చెప్పారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో బీసీల రాజ్యాధికారానికి తొలి అడుగు అని మంత్రి వాకిటి శ్రీహరి అభివర్ణించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. బీసీల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల గుండె చప్పుడు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. బీసీ బిడ్డ కాకపోయినా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట కోసం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా రిజర్వేషన్లు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు పెద్దన్నగా నిలబడ్డారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. కాగా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్షకు పైగా పదవులు పొందడానికి బీసీ నాయకులు సిద్ధం కావాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ పేర్కొన్నారు.