Share News

BC Reservation: సుప్రీం తీర్పు మేరకు బీసీ బిల్లును ఆమోదించినట్లే!

ABN , Publish Date - Oct 10 , 2025 | 04:40 AM

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.....

BC Reservation: సుప్రీం తీర్పు మేరకు బీసీ బిల్లును ఆమోదించినట్లే!

  • రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టం అయినట్లే

  • అందుకే బీసీలకు రిజర్వేషన్లపై జీవో ఇచ్చాం

  • 42% రిజర్వేషన్లను అడ్డుకున్నదే బీజేపీ, బీఆర్‌ఎస్‌

  • ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క

  • ఉత్తర్వులు పరిశీలించాక కార్యాచరణ: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ‘‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ మార్చి 17, 2025న ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపితే మూడు నెలల్లోపు దాన్ని ఆమోదించాలి. లేదా తిప్పి పంపాలి. అలా తిప్పి పంపకుంటే ఆ బిల్లు ఆమోదం పొందినట్లేనని తమిళనాడు వర్సెస్‌ గవర్నర్‌ కేసులో సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 8, 2025న పేర్కొంది. ఆ ఆదేశాల మేరకు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది, చట్టం అయినట్లే. ఆ చట్టం ప్రకారమే స్థానిక ఎన్నిలకు రిజర్వేషన్లపై జీవో జారీ చేశాం’’ అని భట్టి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే శాస్త్రీయంగా ప్రక్రియను నిర్వహించి, జీవో జారీ వరకూ వచ్చామని తెలిపారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరిలతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42ు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నదే బీజేపీ, బీఆర్‌ఎ్‌సలని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చట్టం చేసిందని, ఆ చట్టమే బీసీల రిజర్వేషన్లకు ఉరితాడైందని చెప్పారు. అలాగే బీసీ బిల్లులను పెండింగ్‌లో పెట్టింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మాటలు నమ్మడానికి బీసీలు అమాయకులేమీ కాదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఓబీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్‌ కల్పించడానికి ప్రభుత్వం వద్ద సమగ్ర సమాచారం ఉండాలని తెలిపారు. 2019లో పంచాయతీరాజ్‌ ఎన్నికల తర్వాత తగినంత సమయం ఉన్నా.. సమగ్ర సమాచారం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కులగణన సర్వే ఎందుకు చేయలేదని నిలదీశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారన్న లెక్క తేల్చడానికే తాము కులగణన సర్వే చేశామన్నారు. సర్వే సమాచారాన్ని శాసనసభలో పెట్టి.. దాని ఆధారంగా బీసీలకు 42ు రిజర్వేషన్‌ కల్పిస్తూ రూపొందించిన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారని గుర్తుచేశారు. ఆ బిల్లును గవర్నర్‌, రాష్ట్రపతి వద్దకు పంపితే పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను బీసీలు క్షమించరని చెప్పారు. కాగా, హైకోర్టు స్టే ఉత్తర్వులను అధ్యయనం చేసిన తర్వాత, సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ చెప్పారు.


నేడు మంత్రులతో సీఎం రేవంత్‌ భేటీ?

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకూ ఎదురు చూడాలా? లేక స్టేను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? అన్నదానిపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులను పూర్తిగా అధ్యయనం చేసి, తదుపరి చర్యలకు ఉన్న అవకాశాలను వివరించాల్సిందిగా నిపుణులను కోరినట్లు తెలిసింది. వారి సూచనల ఆధారంగా తదుపరి కార్యాచరణ నిర్ణయించడానికి శుక్రవారం సీఎం రేవంత్‌ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - Oct 10 , 2025 | 04:40 AM